‘పవర్‌’ దందాకు చెక్‌

17 Sep, 2019 04:46 IST|Sakshi

అక్రమ పవన విద్యుత్‌ కొనుగోలు నిలిపివేత

కీలక ఆదేశాలిచ్చిన విద్యుత్‌ శాఖ

404 మెగావాట్ల తాత్కాలిక కనెక్షన్లు కట్‌

సాక్షి, అమరావతి: అవినీతిని అడ్డుకునే క్రమంలో ఏపీ విద్యుత్‌ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన అక్రమ పవన విద్యుత్‌ కొనుగోలును నిలిపివేసింది. తాత్కాలిక కనెక్షన్ల పేరుతో కొనసాగుతున్న 404.4 మెగావాట్ల విండ్‌ పవర్‌ కొనుగోలు నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. గత సర్కార్‌లోని పెద్దలు హద్దులు మీరి అనుయాయుల కోసమే ఈ లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమవ్వడంతో తక్షణమే ఈ విద్యుత్‌ తీసుకోవడాన్ని నిలిపివేయాలని సోమవారం అనంతపురం జిల్లా విద్యుత్‌ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

విద్యుత్‌ కొనుగోలును నిలిపివేసిన సంస్థల్లో రెనర్జీ డెవలపర్స్‌ (99.8 మె.వా), ఎకొరాన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (99.8 మె.వా), హెలియన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ (100.8 మె.వా), వాయుపుత్ర (20 మె.వా), గుట్టసీమ విండ్‌ పవర్‌ (80 మె.వా) ఉన్నాయి. దీంతో రోజుకు రెండు మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోతుంది. కాగా, డిస్కమ్‌లు ఈ విద్యుత్‌ను యూనిట్‌ రూ.4.84 చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. దీన్నివల్ల థర్మల్‌ పవర్‌ ఆపేయడం అనివార్యమవుతుంది. అంతేకాక.. థర్మల్‌ ప్లాంట్లకు యూనిట్‌కు రూ.1.20 చొప్పున స్థిరఛార్జి చెల్లిస్తున్నారు. అంటే విండ్‌ పవర్‌ ఖరీదు యూనిట్‌కు రూ.6.04 వరకూ పడుతోంది. సర్కారు నిర్ణయంతో నెలకు కనీసం రూ.36 కోట్ల వరకు విద్యుత్‌ సంస్థలపై భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..
సంప్రదాయేతర ఇంధన, పునరుత్పత్తి వనరులను ప్రోత్సహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లక్ష్యాలను పెట్టింది. గత ప్రభుత్వం దీన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పవన, సౌర విద్యుత్‌ కనెక్షన్లకు అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా ఈ విద్యుత్‌ ధరలు తగ్గుతున్నా అత్యధిక ధరకు 25ఏళ్ల పాటు కొనేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

నిజానికి గ్రీన్‌ కారిడార్‌ పరిధిలో 997 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని మాత్రమే గ్రిడ్‌కు అనుసంధానం చేసే మౌలిక సదుపాయాలున్నాయి. కానీ, గత ప్రభుత్వంలోని అధికారులు ఏకంగా 1851 మెగావాట్ల పవన విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతించడంతో అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో వీటిని తాత్కాలిక కనెక్షన్లుగా పరిగణిస్తామని అప్పట్లో అధికారులు చెప్పారు. పేరుకు తాత్కాలికమే అయినా, గ్రిడ్‌పై అధిక లోడ్‌తోనే ఇవి విద్యుదుత్పత్తి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి అధికారులు గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం దీనిపై నిపుణులతో కమిటీ వేసి, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన తాత్కాలిక కనెక్షన్లను తొలగించింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా