ప్రసారాల నిలిపివేత అప్రజాస్వామికం

21 Oct, 2014 01:45 IST|Sakshi
ప్రసారాల నిలిపివేత అప్రజాస్వామికం

హైదరాబాద్: మీడియూ హక్కులను కాలరాయడం అప్రజాస్వామికమని పలువురు వక్తలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాలు నిలిపివేయుడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అవసరముందని వారు పేర్కొన్నారు. ప్రసారాల నిలిపివేతకు నిరసనగా సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో దీక్ష చేపట్టారు. దీనికి పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దుతు పలికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ నాయకులు దేవులపల్లి అమర్, ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య, బీజేపీ శాసనసభ పక్షనేత కె.లక్ష్మణ్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు రంగారెడ్డి, నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు మల్లు రవి, నాగం జనార్దన్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం (ఎంఎల్) న్యూడెమ్రోకసీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్, పీవోడబ్ల్యూ సంధ్య, విమలక్క తదితరులు మద్దతు పలికారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ తీరు బ్రిటీష్ పాలన గుర్తుకు తెస్తోందని, బ్రిటీష్ పాలనలో కూడా మీడియాపై ఇంత నిషేధం లేదని అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎంఎస్‌వోల ముసుగులో ప్రభుత్వమే నిషేధం విధించిందని ఆరోపించారు. సాయంత్రం ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి నిరసనను విరమింపజేశారు.
 
మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదు: జవదేకర్

న్యూఢిల్లీ: మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మీడియాపై నిషేధం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(ఐఐఎంసీ) స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘రెండు మూడు రాష్ట్రాలు కొన్ని టీవీ చాన ళ్లపై నిషేధం విధించాయి. ఇది మీడియా స్వేచ్ఛకు విఘాతం కల్పించడమే’’ అని ఆయన అన్నారు. పెయిడ్ న్యూస్ జాడ్యం ఇంకా పోలేదని, ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని గమనించినట్లు వివరించారు. ఈ పెయిడ్ న్యూస్‌ను అరికట్టేందుకు మీడియానే ముందుకు రావాలని కోరారు.
 
 

మరిన్ని వార్తలు