పెరగనున్న కరువు సాయం!

21 Sep, 2017 03:18 IST|Sakshi
- మారిన కరువు నిర్వచనం.. డ్రైస్పెల్‌కు కొత్త అర్థం
లెక్కింపు నిబంధనలు మార్చిన కేంద్రప్రభుత్వం
దీంతో కరువు మండలాల పెంపునకు వెసులుబాటు
ముందస్తు కరువు ప్రకటనకూ అవకాశం 
రాష్ట్రప్రభుత్వం వినియోగించుకుంటే బాధిత రైతులకు ఎంతో మేలు  
 
సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితుల్ని లెక్కించే విధానంలో మార్పులు జరిగాయి. ఆ మేరకు కరువు నిర్వచనం మారిపోయింది. ప్రస్తుతం కరువు నిబంధనావళి ప్రకారం ఏదైనా మండలంలోగానీ/ జిల్లాలోగానీ మూడు వారాలపాటు(21 రోజుల్లో) వర్షం కురవకపోవడాన్ని వాతావరణ పరిభాషలో డ్రైస్పెల్‌(వర్షానికీ వర్షానికీ మధ్య కాలం)గా పరిగణిస్తారు. ఈ నిర్వచనాన్ని కేంద్రప్రభుత్వం మార్చింది. ఇక మూడు, నాలుగు వారాల్లో ప్రతివారం సాధారణం కంటే 50 శాతంలోపు వర్షపాతం నమోదైనా డ్రైస్పెల్‌గానే పరిగణిస్తారు. దీనివల్ల వర్షాభావ సమయంలో పెద్ద ఎత్తున కరువు మండలాలు పెరిగే వెసులుబాటు కలుగనుంది.

అంతేగాక ఎక్కువమంది బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ, అత్యధిక వర్షాభావ ప్రాంతానికి కేంద్ర కరువుసాయం ప్రయోజనం అందడానికి వీలేర్పడనుంది. ఈ మేరకు కరువు నిబంధనావళి(డ్రాట్‌ మాన్యువల్‌)ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ సవరించింది. కరువును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కరువు ప్రాంతాల ప్రకటనకు మార్గదర్శకాలు సవరించామని, వీటిప్రకారమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాల్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అందింది. వరుస కరువులెదుర్కొంటున్న ఏపీలాంటి రాష్ట్రాలకు మారిన కరువు నిబంధనలతో అధిక ప్రయోజనమని వ్యవసాయ, విపత్తు నిర్వహణ నిపుణులంటున్నారు. 
 
కరువు నిర్ధారణకు ఆరంశాలే ప్రామాణికం.. 
కరువు నిర్ధారణ మార్గదర్శకాలు శాస్త్రీయంగా లేవని, దీనివల్ల వర్షాభావ ప్రాంతాలు నష్టపోతున్నాయని, రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు ఉన్నాయి. కరువు ప్రాంతాల్ని ఆదుకునే విషయంలో కేంద్రం సరిగా స్పందించట్లేదని 2015లో సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం కరువు నిబంధనలకు సవరణలు చేసింది. కరువు ప్రాంతాల నిర్ధారణకు ఆరంశాల్ని ప్రామాణికాలుగా తీసుకుంటారు. అవి.. 1) వర్షాభావ పరిస్థితులు, 2) డ్రైస్పెల్, 3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ), 4) నార్మలైజ్డ్‌ డిఫరెన్స్‌ వెజిటేషన్‌ ఇండెక్స్‌ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్‌ డిఫరెన్స్‌ వాటర్‌ ఇండెక్స్‌(ఎన్‌డీడబ్ల్యూఐ) 5) పంటలసాగు విస్తీర్ణం 6) పంట దిగుబడులు.

వీటిలో ఐదంశాలు అనుకూలంగా ఉంటే కరువు ప్రాంతాలుగా ప్రకటించవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధన సడలించి నాలుగంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పటివరకూ.. వర్షాభావం, డ్రైస్పెల్, సాగు విస్తీర్ణం తగ్గుదల, పంట దిగుబడి తగ్గుదల అంశాల్ని లెక్కలోకి తీసుకుని కరువు మండలాలు ప్రకటించేవారు. ఆ ప్రకారం కేంద్రం సాయం ప్రకటించేది. అయితే ఆ ప్రకారం డ్రైస్పెల్‌ చాలా ప్రాంతాల్లో ఉండట్లేదు. 21 రోజుల్లో ఏదో ఒకరోజు కొద్దిపాటి వర్షంపడినా డ్రైస్పెల్‌ లేనట్లు పరిగణించేవారు. దీనివల్ల కరువు మండలాల ప్రకటనలో అన్యాయం జరుగుతోందని సర్వత్రా విమర్శలొచ్చిన నేపథ్యంలోనే మూడు, నాలుగు వారాల్లో వారం వారం 50 శాతంలోపు వర్షపాతం నమోదైనా డ్రైస్పెల్‌గా పరిగణించాలన్న కొత్త నిబంధనను తీసుకొచ్చారు.
 
ముందస్తు కరువు ప్రకటనకు వెసులుబాటు
జూన్‌–సెప్టెంబర్‌ ఖరీఫ్‌ సీజన్‌. ఈ సీజన్‌లో వర్షాభావ పరిస్థితి ఏర్పడితే అక్టోబర్‌లో కరువు మండలాల్ని నిర్ధారించి ప్రకటించాలని గత నిబంధనావళిలో ఉండేది. కొత్త నిబంధన ప్రకారం ముందస్తుగా ఆగస్టులోనే కరువు మండలాల్ని నోటిఫై చేయవచ్చు. జూన్, జూలై నెలల్లో వర్షాభావం ఏర్పడితే రాష్ట్రప్రభుత్వం స్పందించి ఆ కాలంలో వర్షాభావం, పంటలసాగు, డ్రైస్పెల్, భూగర్భ జలమట్టం, రిజర్వాయర్లలో నీటిమట్టం అంశాల్ని పరిగణనలోకి తీసుకుని కరువు మండలాల్ని ప్రకటించి కరువు ఉపశమన చర్యలకోసం ఆర్థికసాయం కోరుతూ కేంద్రానికి నివేదిక పంపవచ్చు. ఈ ఒక్క సవరణ నిబంధన వల్ల రాష్ట్రానికెంతో ప్రయోజనం చేకూరనుంది.

రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో సగంపైగా మండలాల్ని కరువు ప్రాంతాలుగా ప్రకటించడానికి అవకాశముంటుంది. ఈ ఏడాది జూన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా జూలైలో వర్షపాత లోటు, డ్రైస్పెల్‌ అత్యధిక మండలాల్లో ఉంది. ఆగస్టు రెండోవారం నాటికి 240కిపైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. అత్యధిక మండలాల్లో డ్రైస్పెల్‌ ఉంది. రిజర్వాయర్లలోనూ నీరు లేదు. భూగర్భ జలమట్టం  పడిపోయింది. ఈ అంశాల ప్రాతిపదికన ఎక్కువ కరువు మండలాల్ని ప్రకటించడానికి వీలుంది. 
మరిన్ని వార్తలు