కనికరం ‘కరువు’

27 Aug, 2018 03:35 IST|Sakshi

రాష్ట్రంలో 395 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు

కేవలం 275 మండలాలే కరువు ప్రాంతాలట! 

నిబంధనల సాకుతో 120 మండలాలకు అన్యాయం 

రైతాంగానికి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడుతున్న ప్రభుత్వం 

2016తో పోల్చితే 5.89 లక్షల హెక్టార్లలో తగ్గిన సాగు

సాక్షి, అమరావతి: రైతులపై ఈ సర్కారు కాస్తయినా కనికరం చూపడం లేదు. కళ్లెదుట కనిపిస్తున్న కరువుకు పరదా కప్పేసింది. ప్రభుత్వ వాతావరణ శాఖ అధికారిక గణాంకాల ప్రకారమే 395 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. సాధారణం కంటే తక్కువ వర్షం కురిసినందున రాష్ట్రంలో 395 మండలాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు తేల్చి చెబుతుండగా, ప్రభుత్వం 275 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. మిగిలిన 120 మండలాలు ‘పచ్చ’గా ఉన్నట్లు నివేదికల్లో చేర్చేసింది. కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే ఈ 120 మండలాల్లోనూ పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలనే రకరకాల నిబంధనలు పేరిట 120 మండలాలను కరువు జాబితాలో చేర్చలేదు.

ఏటా ఇదే తంతు 
కరువు బారిన పడిన రైతాంగాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరువు మండలాలను పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడం, పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగ్గొట్టడం చంద్రబాబు సర్కారుకు అలవాటే. 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రూ.2,350 కోట్ల మేర పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేశారు. 2015లో దుర్భిక్ష మండలాలను సగానికి కుదించారు. 2016లోనూ అలాగే చేశారు. 2017 ఖరీఫ్‌లో పంటలన్నీ ఎండిపోయినా సెప్టెంబర్, అక్టోబర్‌లో అల్పపీడనాల వల్ల కురిసిన వర్షాన్ని లెక్కలోకి తీసుకుని కరువు లేదని ప్రకటించడం ద్వారా రైతులను దగా చేశారు. 2017 రబీలో 350 మండలాల్లో వర్షపాతం లోటు ఉన్నా 121 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. 

పడిపోయిన సాగు విస్తీర్ణం 
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జూన్, జూలై నెలల్లో ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. ఇందులో గుంటూరు జిల్లా కూడా ఉంది. గుంటూరు జిల్లాలో 18, విజయనగరం జిల్లాలో 10 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నా ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. జూన్, జూలై నెలల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆరు జిల్లాల్లో 275 కరువు మండలాలను ప్రకటించినట్లు ప్రభుత్వం ఈ నెల 8న జారీచేసిన జీవోలో పేర్కొంది. అనంతపురం జిల్లాలో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉండగా, 44, కర్నూలు జిల్లాలో 54 మండలాలకు గాను 37, చిత్తూరులో 66 మండలాలకు గాను 58 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ ఖరీఫ్‌లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది లక్ష్యం కాగా.. 9.6 లక్షల ఎకరాల్లోనే సాగైంది. 2016తో పోల్చితే ఈ సంవత్సరం ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2016 జూన్, జూలై నెలల్లో 13,93,933 హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈ ఏడాది ఇదే కాలంలో సాగు విస్తీర్ణం 8,04,844 హెక్టార్లకు పడిపోయింది. 

2016తో పోల్చితే ఈ ఏడాది 5.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు తగ్గిపోవడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో సాధారణంగా 247.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 215.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. 

రైతాంగాన్ని ఆదుకోవాలి
‘‘రాష్ట్రంలో దుర్భిక్షం తీవ్రత కళ్లకు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో కరువు మండలాలను ప్రకటించకపోవడం దారుణం. రైతాంగాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన సర్కారు ఇలా కరువును దాచేయడం ఏమాత్రం సమంజసం కాదు’’ 
– నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు

>
మరిన్ని వార్తలు