నాలుగో వంతు కరువే!

17 Oct, 2013 02:18 IST|Sakshi
నాలుగో వంతు కరువే!

* 292 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు  
ఈసారీ రైతులకు నిరాశే మిగిల్చిన నైరుతి
 
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కూడా రైతులకు నిరాశే మిగిల్చాయి. సీజన్ కంటే వారం రోజులు ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించి ఆశలు రేకెత్తించినా చివరకు ఉసూరుమనిపించాయి. 292 మండలాల్లో కరువును మిగిల్చి వెళ్లిపోయాయి. గత ఏడాది 234 మండలాల్లో వర్షాభావం ఏర్పడగా ఈ ఏడాది వాటి సంఖ్య మరింత పెరగడం గమనార్హం. నైరుతి సీజన్ సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసింది. వర్షపాతం ఆధారంగా ఈ ఖరీఫ్‌లో (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) 292 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విపత్తు నిర్వహణ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

ఈ లెక్కల ప్రకారం ఏడు జిల్లాల పరిధిలో వర్షాభావ పరిస్థితి నెలకొనగా.. 30 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 262 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. 30 మండలాల్లో సాధారణ సగటు వర్షపాతం కంటే 60 నుంచి 99 శాతం తక్కువ వర్షం కురిసింది. సెప్టెంబర్ చివరినాటికి కురిసిన వర్షపాతం ఆధారంగా ఈ లెక్కలు కట్టారు. వాస్తవానికి సెప్టెంబర్ చివరి పక్షంలో కురిసిన వర్షాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఖరీఫ్ ముగుస్తున్న సమయంలో కురిసిన ఈ వానలతో పంటలు సాగు కావు.

కరువు మండలాల ఎంపిక ప్రక్రియలో చేసే పంటకోత ప్రయోగాల ప్రకారం రాష్ట్రంలో కరువు మండలాలు 350 నుంచి 400 వరకు ఉంటాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 49 మండలాల్లో కరువు నెలకొంది. పశ్చిమగోదావరిలో 32 మండలాల్లో, విశాఖపట్నం జిల్లాలో 31 మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. మొత్తమ్మీద రాష్ట్రంలో 1,128 మండలాలు ఉండగా (292 మండలాల్లో) నాలుగోవంతు ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులే నెలకొన్నాయి.

వైఎస్సార్, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షం కురిసింది. సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ సిబ్బంది సమ్మెలో ఉన్నందున క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని కరువు మండలాలు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశముంది.
 

మరిన్ని వార్తలు