కరువును ఎదుర్కొందాం

21 Aug, 2015 04:01 IST|Sakshi
కరువును ఎదుర్కొందాం

- ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించండి
- జెడ్పీ సమావేశంలో అధికారులకు చైర్మన్ చమన్ హితబోధ
అనంతపురం సెంట్రల్ :
గతంలో ఎన్నో కరువులను చూశాం.. ఈసారి అంతకన్నా భయంకరమైన కరువు వచ్చింది.. కరువు బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించాలి... అందరం కలిసి కరువును ఎదుర్కొందాం.. అని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల సంక్షేమమే పరమావధిగా చర్చ జరిగేలా సహకరించాలని కోరారు. గురువారం జెడ్పీ మీటింగ్‌హాలులో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గ్రామీణ నీటిసరఫరా, జిల్లా నీటియాజమాన్యసంస్థ, జిల్లా విద్యాశాఖ, హెచ్చెల్సీ, చిన్ననీటిపారుదల శాఖలపై చర్చించారు.

ఈ సందర్బంగా   చైర్మన్ చమన్ మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి ఆయా శాఖలకు నేరుగా నిధులు మంజూరవుతున్నాయని, అవి సక్రమంగా ప్రజలకు అందేలా ఆయా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సభ్యులు ఒకే అంశంపై గంటల తరబడి మాట్లాడడం సబబు కాదని అన్నారు. కేవలం జెడ్పీ సమావేశాల్లో కాకుండా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీని వలన జెడ్పీ సమావేశాల్లో అన్ని శాఖలపై చర్చించేందుకు అవకాశం వస్తుందన్నారు. జిల్లాలో దాదాపు 40 శాఖలున ్నప్పటికీ ఎప్పుడూ ఐదారు శాఖలతో ముగించాల్సి వస్తోందని సభ్యులకు సూచించారు. అనంతరం సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు ఏకరవు పెట్టారు.

బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ రామలింగారెడ్డి మాట్లాడుతూ... అనంత కార్పొరేషన్‌నుంచి వచ్చే మురుగునీటిని మొత్తం మండల పరిధిలో ఉన్న కాలనీల్లోకి, ఈ సమస్యను పలుమార్లు తమ దృష్టికి తెచ్చినా ఫలితంలేదని అన్నారు. భాగ్యనగర్ స్కూల్‌లోకి మురుగునీరు వచ్చి చేరుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో పాటు నాలుగైదు కాలనీ ప్రజలు మురుగునీటితో అవస్థలు పడుతున్నారని, మురుగుకాలవను మరికొంత దూరం పొడిగించాలని కోరారు..  అనంతపురం రూరల్ జెడ్పీటీసీ వేణుగోపాల్ మాట్లాడుతూ... లక్ష ఓట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నా తాము చిన్న చిన్న అభివృద్ది పనులు కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

జెడ్పీకి వస్తున్న అరకొర నిధులు పంచాయతీలకు, తాగునీటి పథకాలకే సరిపోతున్నాయని అన్నారు. మడకశిర జె డ్పీటీసీ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ... ఈ సమస్యను 63 మంది జెడ్పీటీసీలు ముక్తకంఠంతో ఏకీభవిస్తున్నామని అన్నారు. పెనుకొండ జెడ్పీటీసీ నారాయణస్వామి మాట్లాడుతూ... ఏరోజైతే జెడ్పీటీసీ గెలిచామో అదే రోజే పదవీవిరమణ చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీకి ఏమాత్రం గౌరవం లేకుండా చేస్తున్నారని అన్నారు. మూడెంచల విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కంబదూరు జెడ్పీటీసీ రామ్మోహన్‌చౌదరి మాట్లాడుతూ... రూ. 700 కోట్లతో నిర్మించిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం మొత్తం లోపభూయిష్టంగా నిర్మించారన్నారు. 3,4 రోజుల కొకసారి కూడా నీరివ్వకపోతే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. నీరివ్వలేదని ప్రజలు జెడ్పీటీసీలను నిలదీస్తున్నారని, ట్యాంకుల సరఫరా రేట్లు పెంచి నీటిని సరఫరా చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు