రాష్ట్రంలో మందుల సంక్షోభం!

4 Feb, 2019 02:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా అత్యవసర మందులు అందుబాటులో ఉండడంలేదు. దీంతో సామాన్య, పేద రోగులు విలవిల్లాడుతున్నారు. ఓ వైపు 104 వాహనాలు పల్లెలకు వెళ్లకపోవడం, ఇటు ఆస్పత్రులకు వస్తే మందుల్లేవని చెబుతుండడంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న రోగులు బయట కొనుగోలు చేసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. గుండె, కిడ్నీ, మూర్ఛ రోగులకు ఇవ్వాల్సిన అత్యవసరమైన మందులు సైతం ఏ ఆస్పత్రిలోనూ అందుబాటులో లేవు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారాసెటిమాల్‌ జ్వరం బిళ్లకు కూడా దిక్కులేని పరిస్థితి. ఇంతటి మందుల కొరత తామెప్పుడూ చూడలేదని, అన్ని ఆస్పత్రుల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌లు చెబుతున్నారు. కొంతమంది రోగులు ప్రశ్నిస్తుంటే పైనుంచే మందులు రావడంలేదని ఫార్మసిస్ట్‌లు నచ్చజెబుతున్నారు. డాక్టర్లు చిట్టీలు రాసి బయట తెచ్చుకోవాలని రోగులకు సూచిస్తున్నా సర్కారులో ఎలాంటి చలనంలేదు.

స్థానిక కొనుగోళ్లకు మంగళం
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాస్పత్రులకూ ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) మందులను సరఫరా చేస్తుంది. ఇందుకు 2018–19 సంవత్సరానికి రూ.250 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచే 1175 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 192 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 31 ఏరియా ఆస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాసుపత్రులు, మరో 11 స్పెషాలిటీ ఆస్పత్రులకు మందులు సరఫరా కావాలి. అలాగే, ప్రతి ఆస్పత్రికీ ఏటా మందులకు అయ్యే వ్యయంలో 20 శాతం స్థానికంగా కొనుగోళ్లు (అత్యవసర పరిస్థితుల్లో) చేసుకునేందుకు అనుమతి ఉంది. ఉదాహరణకు గుంటూరు పెద్దాసుపత్రికి ఏడాదికి రూ.7 కోట్లు ఖర్చయితే.. స్థానిక కొనుగోళ్ల కింద రూ.1.40 కోట్లు ఇవ్వాలి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులకూ అవకాశం ఉంటుంది. కానీ, 18 నెలల నుంచి స్థానిక కొనుగోళ్ల కింద నిధులివ్వకపోవడంతో అన్ని ఆస్పత్రుల్లో కలిపి రూ.140కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సరఫరాదారులు మందులను అందించడంలేదు.

సర్జికల్‌ బకాయిలూ రూ.90 కోట్లు
మందులకు మాదిరిగానే శస్త్రచికిత్సల ఉపకరాణలకు కూడా ప్రతి ఆస్పత్రికి స్థానిక కొనుగోళ్లకు బడ్జెట్‌ కేటాయించాలి. గ్లౌజుల నుంచి సూచర్‌ (కుట్లకు వాడే దారం) వరకూ అత్యవసర పరిస్థితుల్లో బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ, దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 28 నెలలుగా డబ్బులివ్వకపోవడంతో సప్లయర్లు వాటి సరఫరాను నిలిపివేశారు. దీంతో సుమారు రూ.90 కోట్ల వరకు వారికి బకాయిలు చెల్లించాల్సి ఉంది. సూదులు, సిరంజిలు, కాటను, బ్యాండేజీ వంటి చిన్నచిన్నవి కొనుగోలు చేసేందుకు కూడా ఆస్పత్రుల వద్ద డబ్బుల్లేవు. కొన్ని ఆస్పత్రుల్లో అయితే పేషెంటును సర్జరీకి తీసుకెళ్లే ముందు ఆపరేషన్‌కు అవసరమైన వాటిని తెచ్చుకోమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. అలా తెచ్చిన తర్వాతే శస్త్రచికిత్స మొదలుపెడుతున్నారంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. బడ్జెట్‌ విషయమై ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీని అడిగితే తాను చెక్కులు రాసి పంపించానని, ఆర్థిక శాఖలో విడుదల చేయాల్సి ఉందని చెబుతున్నారని ఆస్పత్రుల వైద్యులు చెబుతున్నారు. 

సరఫరా చెయ్యకపోతే బ్లాక్‌లిస్టులో..
18 నెలలుగా నిధులు ఇవ్వకపోయినా సరే మందులు సరఫరా చేయాల్సిందేనని, లేదంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని అధికారులు తమను బెదిరిస్తున్నట్లు సంస్థలు వాపోతున్నాయి. రూ.140 కోట్ల బకాయిలు చెల్లించకుండా ఇలా బెదిరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సరఫరా చేస్తున్న సంస్థలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయని, ఏపీకి ఎవరైనా సప్లయ్‌ చెయ్యడానికి రావాలంటే భయపడి పారిపోతున్నారని సరఫరాదారులు చెబుతున్నారు. 

మూర్ఛ రోగుల నిరసన
గుంటూరు పెద్దాసుపత్రికి ఎపిలెప్సీ (మూర్ఛ) రోగులు నెలవారీ మందులకు నెలనెలా వస్తుంటారు. కానీ, గత కొంతకాలంగా వీరికి మందులు ఇవ్వడంలేదు. దీంతో ఈనెల 26న గుంటూరు ఆస్పత్రికి వచ్చిన పలువురు మూర్ఛ రోగులు ఆందోళనకు దిగారు. మందులు ఎందుకు సరఫరా చేయడంలేదని వైద్యులను నిలదీశారు. గొడవ పెద్దదవుతోందని, ఇది మీడియా కంటపడితే మరింత ఇబ్బంది అని భావించిన ఆస్పత్రి అధికారులు.. బయట నుంచి మందులు కొనుక్కొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన వారికి డాక్టరు లేరని, ఫార్మసిస్ట్‌ లేడని చెప్పి పంపించేశారు. రాష్ట్రంలోని అనేక ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి.

సీఎం సొంత జిల్లాలో ఇదీ పరిస్థితి..
- చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో డోంపర్‌డైన్‌ 10 ఎంజీ మాత్రలు 38వేలు అవసరమున్నాయని అడిగితే కేవలం పదివేలు మాత్రమే సరఫరా చేశారు.
ఇదే ఆస్పత్రిలో అడ్రినల్‌ బైటార్‌ట్రేట్‌ 1 ఎంజీ ఇంజిక్షన్లు 120 కావాలని అడిగితే ఒక్కటీ సరఫరా చెయ్యలేదు.
అమాక్సిలిన్‌ క్లావిలిక్‌ యాసిడ్‌ ఓరల్‌ సస్పెన్షన్‌ మందులు 2వేలు అడిగితే ఒక్కటీ ఇవ్వలేదు.
ఆమ్లొడిపైన్‌ ఐపీ 5ఎంజీ మందులు 30వేల టాబ్‌లెట్లు అవసరమని ఇండెంట్‌ ఇస్తే గడిచిన 10 నెలల్లో కేవలం 10వేలు మాత్రమే సరఫరా చేశారు.
అబ్జార్బబుల్‌ కాటన్‌ బ్యాండేజీలు 50 అడిగితే ఒక్కటీ ఇవ్వలేదు.
ఎనలాప్రిల్‌ మిలెట్‌ 5ఎంజీ టాబ్‌లెట్లు వెయ్యి ఇండెంట్‌ పెడితే ఒక్కటీ ఇవ్వలేదు. 

మరిన్ని వార్తలు