తాగి ఊదితే...  ఊచల వెనక్కే!

19 Jun, 2019 10:58 IST|Sakshi

తాగి వాహనాలు నడపటంతో పెరుగుతున్న ప్రమాదాలు

విస్తృత తనిఖీలు చేపడుతున్న పోలీసు శాఖ

సాక్షి, పర్చూరు (ప్రకాశం): తాగిన తరువాత రోడ్డు పైకి వాహనాలతో వస్తామంటే కుదరదు. ఆ పరిస్థితిలో తాగి నడిపిన వ్యక్తులకూ ప్రమాదం జరగవచ్చు. పద్ధతిగా రోడ్డు నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా వెళుతున్నవారు తాగిన వారి వల్ల నష్టపోతున్న సంఘటనలు అనేకం. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజల్లో వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు పోలీసులు రోజూ తనిఖీలు నిర్వహించడం, రోడ్లుపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపి ఊదించే కార్యక్రమాలు ( శ్వాస నిర్ధారణ పరీక్షలు) బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా చేయిస్తున్నారు. జరిమానాలు, కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు. కొందరు జైల్లో ఊచలు లెక్కపెట్టే వరకు వెళ్తోంది. పర్చూరు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.

ప్రమాదాలు అనేకం
మద్యం తాగి ప్రమాదాల బారిన పడ్డ సంఘటనలు అనేకం. మరణిస్తేనో లేదంటే తీవ్రంగా గాయపడ్డప్పుడో విషయం బయటికి వస్తుంది. మత్తులో వాళ్లంతట వాళ్లుగా కిందపడి చిన్న చిన్న గాయాలతో బయటపడి వెళ్ళి పోతున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది. ప్రతి నిత్యం వివిధ కూడళ్లు, రహదారిపై పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌ పట్టుకుని సిద్ధంగా ఉంటున్నారు. రహదారిపై తాగి నడిపిన వారు పట్టుబడుతున్నారు. ఇటీవల ఈ కేసుల్లో తీర్పులు కఠినంగా వస్తున్నాయి.

గత ఆరు నెలలుగా నమోదైన మద్యం కేసుల వివరాలు ఇలా...
ఇంకొల్లు సర్కిల్‌ పరిధిలోని ఇంకొల్లు, పర్చూరు, చినగంజాం, మార్టూరు, యద్దనపూడి, జె.పంగులూరు మండలాల్లో గత ఐదు నెలలుగా మద్యం తాగి వాహనాలు నడిపిన 322 మందిపై కేసులు నమోదు చేశారు.


తనిఖీలు విస్తృతంగా చేపట్టిన పోలీసులు 
మద్యం తాగి వాహనం నడిపితే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మద్యం తాగి వాహనం రోడ్డు పైకి తెచ్చిన వారి లైసెన్స్, వాహన పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనం పై తాగి ఒక్కరు వెళుతుంటే వాహనం స్వాధీనం చేసుకుంటున్నారు. ఇద్దరు ఉంటే మరో వ్యక్తి మంచి స్థితిలో ఉండి సొంత పూచీకత్తుపై వాహనాన్ని ఇస్తారు. ఆ పై కోర్టుకు పంపిస్తారు. కోర్టులో జరిమానా లేదా నెల రోజుల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రెండూ కూడా అమలు చేయొచ్చు. మద్యం తాగి వాహనం నడుపుతూ రెండోసారి కేసు నమోదైతే వాహన ధ్రువీకరణపత్రం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు. జరిమానా, జైలు శిక్ష రెండూ అమలు చేస్తారు.

తాగి వాహనాలు నడపటం వల్లే ప్రమాదాలు
మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు చాలా వరకు ఆస్కారం ఉంది. అందుకే రహదారులపై తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. పరిమితికి మించి మద్యం తాగి పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. కోర్టులో హాజరు పరుస్తాం. రోడ్డు నియమాలు విధిగా పాటించాలి. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు.
– ఇంకొల్లు సీఐ శేషగిరిరావు

మరిన్ని వార్తలు