మందు మృగాలు చంపేశాయి..

22 Sep, 2017 06:56 IST|Sakshi
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన శ్రీకాంత్‌

మద్యం మత్తులో మందుబాబుల ఆగడం
సినిమాకు వెళుతున్న ముగ్గురు బాలురపై ప్రతాపం
చేతికి చిక్కిన బాలుడ్ని రోడ్డుపై తిప్పి తిప్పి చితకబాదిన వైనం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై ఘోరం
చికిత్స పొందుతూ బాలుని మృతి..
పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు


గుంటూరు జిల్లా ,కుంచనపల్లి(తాడేపల్లి రూరల్‌) : ఫూటుగా మద్యం సేవించిన మందుబాబులు బుధవారం అర్ధరాత్రి ఓ బాలుడి పట్ల అతి క్రూరంగా వ్యవహరించారు. తన అభిమాన సినీహీరో సినిమా బెనిఫిట్‌ షో చూద్దామని ఇద్దరు స్నేహితులతో కలసి బయల్దేరిన ఆ బాలుడ్ని ఆపి.. విచక్షణారహితంగా కొట్టారు. కసితీరా చితకబాదాక రోడ్డుమీద వదిలేసి వెళ్లారు. తీవ్రగాయాల పాలైన బాలుడ్ని స్థానికులు గమ నించి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతిచెందాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై తాడేపల్లి బైపాస్‌ రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది.

స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత ఒకటోవార్డులో నివాసముండే శ్రీకాంత్‌(16) ఇళ్లల్లో సీలింగ్‌ పని చేస్తుంటాడు. మెకానిక్‌గా పనిచేసే ఉం డవల్లికి చెందిన అన్వర్, సెల్‌పాయింట్‌లో పనిచేసే ఎస్‌కే ఆజూలు అతని స్నేహితులు. బుధవారం పగలంతా తమ పనులకు వెళ్లి వచ్చిన ముగ్గురు బాలురూ తమ అభిమాన నటుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త సినిమా బెనిఫిట్‌ షో చూసేందుకని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆజూ ద్విచక్ర వాహనంపై మంగళగిరికి బయల్దేరారు. ఒకటోవార్డు నుంచి బయల్దేరి.. కుంచనపల్లి బకింగ్‌హామ్‌ కరకట్ట నుంచి అరవింద స్కూల్‌ మీదుగా బైపాస్‌ రోడ్డు చేరుకున్నారు.

అయితే అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి రోడ్డుపక్కనే కూర్చుని ఉన్న నలుగురు యువకులు వారిని ఆపి, ‘‘పిల్ల వెధవల్లారా.. అర్ధరాత్రి రోడ్లపై మీకేంట్రా పని? దొంగల్లాగా కనిపిస్తున్నారు..’’ అంటూ దాడికి దిగారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. భయపడిన ఆజూ, అన్వర్‌లు శ్రీకాంత్‌ను వదిలేసి పరుగు తీశారు. దీంతో తమ చేతికి చిక్కిన శ్రీకాంత్‌పై మద్యంబాబులు ప్రతాపం చూపారు. అంతేగాక అతడ్ని వెంటపెట్టుకుని ఆ నలుగురు యువకులు మరో ఇద్దరితో కలసి ఓల్డ్‌ టోల్‌గేట్‌ ఎదురుగా ఉన్న రోడ్డులోని వైన్స్‌ వద్దకు తీసుకెళ్లి అక్కడా చితకబాదారు. వైన్స్‌లో మద్యం తీసుకుని తాగాక మళ్లీ కుంచనపల్లిలోని కీర్తి ఎస్టేట్‌ వద్దకు బాలుడ్ని తీసుకెళ్లి కొట్టారు. మరలా అక్కడ్నుంచీ అభినందన రోడ్డులోకి తీసుకెళ్లి మరోసారి చితకబాది వదిలేసి పోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను గమనించిన స్థానికులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకూ సమాచారమిచ్చారు.

అయితే గురువారం మధ్యాహ్నం వరకు బాలుడి వివరాలు పోలీసులకూ తెలియలేదు. ఈలోగా తన కొడుకు కనపడకపోవడంతో ఆందోళన చెందిన శ్రీకాంత్‌ తల్లి సబిత ఆజూ, అన్వర్‌లను నిలదీయడంతో విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ గురువారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో మృతిచెందాడు. అతని తల్లి విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన కుంచనపల్లికి చెందిన ఆరుగురు యువకులు గంధం నరేష్, చెన్నంశెట్టి గోపాలకృష్ణ, అమరా వేణు, మిరియాల నవీన్, గుంటముక్కల శేషు, మిరియాల వెంకటేశ్‌లను గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా కుంచనపల్లి గ్రామానికి చెందినవారేనని తెలిపారు. నార్త్‌జోన్‌ డీఎస్పీ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.

>
మరిన్ని వార్తలు