డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టతలేని ప్రభుత్వం

15 Sep, 2014 01:24 IST|Sakshi
డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టతలేని ప్రభుత్వం

గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ యాజమానాల్లోని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు డిమాండ్ చేశారు. గుంటూరులోని సంఘ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి కరువైందని విమర్శించారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ పెండింగ్‌లో ఉన్న కారణంగా రాష్ట్రంలో 636 ఎంఈవో పోస్టులకు గానూ 534,66 డీవైఈవో పోస్టులకు గానూ 55,180 డైట్ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. సర్వీస్ రూల్స్ సాధనకు సుప్రీంకోర్టు ద్వారా స్పష్టమైన ఉత్తర్వుల సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌కు స్పష్టమైన ప్రకటన విడుదల చేసి తక్షణమే బదిలీలతో పాటు రేషనలైజేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. 10వ పీఆర్‌సీ గతేడాది జూలై నుంచి అమల్లోకి తెచ్చి, అక్టోబర్ ఒకటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని స్వాగతిస్తున్నామని, అయితే యంత్రాల కంటే అధికారులను పూర్తిస్థాయిలో నియమించి విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణను గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల ద్వారా చేపట్టాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర సహోధ్యక్షుడు ఎం.లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బెన్‌హర్‌బాబు, కె.మరియదాసు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు