ఇసుక అక్రమ రవాణాపై దాడులు

2 Dec, 2018 10:47 IST|Sakshi

మంకీ క్యాప్‌ ధరించి, బైక్‌పై వెళ్లిన డీఎస్పీ శ్రీనివాసరావు

ఇసుకాసురులను బైండోవర్‌ చేయాలని ఆదేశం  

ప్రొద్దుటూరు క్రైం : ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. స్వయంగా డీఎస్పీ దాడులు నిర్వహించారు. డీఎస్పీ ఎప్పుడు బయటికి వెళ్లినా గన్‌మెన్‌ ఉంటారు. ప్రభుత్వం కేటాయించిన వాహనంలోనే ఆయన ఎక్కడికైనా వెళ్తారు. అయితే ప్రొద్దుటూరు డీఎస్పీ మాత్రం మంకీ క్యాప్‌ ధరించి, బైక్‌పై వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. శనివారం వేకువజామున పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో డీఎస్పీ శ్రీనివాసరావు దాడులు నిర్వహించారు. 

మంకీ క్యాప్‌ ధరించి బైక్‌లో పెన్నా నదికి వెళ్లే రహదారి వద్దకు వెళ్లారు. పెన్నా నదిలో కొన్ని ట్రాక్టర్లకు ఇసుకను నింపుకుంటూ ఉండగా పోలీసుల రాకను గమనించడానికి కొందరు ఫైలెట్‌లు బైపాస్‌ రోడ్డులో నిల్చున్నారు. డీఎస్పీ నేరుగా వారి వద్దకు వెళ్లి బైక్‌ ఆపారు. అయితే మంకీ క్యాప్‌ పెట్టుకొని ఉండడంతో వారు డీఎస్పీని గుర్తు పట్టలేదు. అక్కడే 15 నిమిషాల పాటు నిల్చొని ఉండి డీఎస్పీ వారి సంభాషణలు విన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఏమైనా ఉందేమోనని ఆరా తీశారు. తర్వాత మంకీ క్యాప్‌ను తొలగించి అక్కడున్న ఫైలెట్‌లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీని చూసి ట్రాక్టర్ల డ్రైవర్లు పరారయ్యారు. అయితే ఒక ఇసుక ట్రాక్టర్‌ డ్రైవర్‌ను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు.

కఠిన చర్యలు
పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. రోజూ ఇసుక రవాణా చేస్తున్న వారిని గుర్తించి బైండోవర్‌ చేయాలని వన్‌టౌన్‌ సీఐ రామలింగరాజును ఆదేశించారు. డీఎస్పీ స్వయంగా దాడులకు పూనుకోవడంతో ఇసుకాసురుల్లో వణుకు పుడుతోంది. ఇసుక రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని వన్‌టౌన్‌కు పిలిపించి డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకపై ఇలా జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు