మాపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాస్తున్నారు: డీఎస్పీ

21 Feb, 2020 14:04 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తే వారికి జోలికి వెళ్లం.. కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోమని తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రైతుల ముసుగులో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. వారి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. నిన్న(గురువారం) రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తే డ్రోన్‌ ఆపరేట్‌ చేశామని పేర్కొన్నారు. అయితే డ్రోన్‌ను కిందకు దించే సమయంలో ఆపరేటర్‌పై దాడి చేసి డ్రోన్‌ను ఎత్తుకెళ్లారని ఆయన  తెలిపారు.

అయితే డ్రోన్‌ల ద్వారా మహిళలు స్నానం చేసే విజువల్స్‌ను పోలీసులు తీసుక్నునారంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాశారన్నారు. అంతేగాక గతంలో కూడా ఓ మహిళను కాలితో తన్నినట్లు తప్పుడు వార్తలు రాశాని తెలిపారు. ఇక రైతులను రెచ్చగొడుతున్న జేఎసీ నాయకుడు పువ్వాడ సుధాకర్‌ను అరెస్టు చేసే ప​యత్నం చేశామని, కానీ మహిళా రైతులు అడ్డుపడటంతో అరెస్ట్‌ చేయలేకపోయామన్నారు. హోంమంత్రి, డీజీపీలు సచివాలయానికి వస్తుంటే ట్రాక్టర్లు,  ట్రక్కులు అడ్డుపెట్టిన వారిపై కేసు పెట్టామన్నారు. ఎమ్మెల్యే రోజాను కూడా అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా రైతులు తమకు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు