జోరుగా చెరకు నాట్లు

2 Jun, 2014 00:44 IST|Sakshi
  • అకాల వర్షాలతో జోరుగా నాట్లు
  •  సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
  •  చోడవరం, న్యూస్‌లైన్ : ఖరీఫ్‌కు ముందే వర్షాలు కురవడంతో చెరకు నాట్లు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది చెరకు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరుతో జిల్లాలో అన్ని సహకార చక్కెర కర్మాగారాలు క్రషింగ్‌ను ముంగించడంతో మే నుంచే చెరకు నాట్లు వేసేందుకు రైతులు శ్రీకారం చుట్టారు.

    ఇప్పటికే 60 శాతం నాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది జిల్లాలో లక్షా 64 వేల ఎకరాల్లో చెరకు సాగు జరిగింది. దీనివల్ల చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి (తుమ్మపాల) సుగర్ ఫ్యాక్టరీలు అనుకున్న లక్ష్యం మేరకు సకాలంలో  క్రషింగ్ చేయగలిగాయి. గడచిన సీజన్‌లో బెల్లం ధర కూడా రైతులకు ఊరటనిచ్చింది. పంచదార ధరలు పెరుగుతూ... తగ్గుతూ వచ్చినప్పటికీ 2013-14 సీజన్‌లో సుగర్ ఫ్యాక్టరీలు కూడా మద్దతు ధర ఆశాజనకంగానే చెల్లించాయి.

    అత్యధికంగా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ టన్నుకు రూ.2300 వరకు చెల్లించగా మిగలిన మూడు ఫ్యాక్టరీలు రూ.1800 నుంచి రూ.2 వేలు వరకు చెల్లించాయి. ఈ ఏడాది కేంద్రమే నేరుగా చెరకు టన్నుకు రూ.2125 మద్దతు ధర ఇవ్వాలని నిర్దేశించడంతో పెట్టుబడులు పెరిగినా రైతులు చెరకు సాగుపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికితోడు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఇతర సదుపాయాలు ఇచ్చేందుకు ఫ్యాక్టరీలు కూడా ముందుకు రావడం రైతుకు కొంత ఊరట కలుగుతుంది.

    ఈ పరిస్థితుల్లో గత సీజన్ కంటే ఈసారి జిల్లాలో చెరకు విస్తీర్ణం బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్దతు ధర, రాయితీలతోపాటు నాట్లు వేసే సమయంలో వర్షాలు కూడా అనుకూలించడంతో జోరుగా చెరకు నాట్లు వేస్తున్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటం వల్ల   సాగునీటి ఇబ్బందులు ఉండవని రైతులు భావిస్తున్నారు.

    అందుకే ఈ సారి మెట్ట ప్రాంతాల్లో ముందుగానే దుక్కులు దున్ని చెరకు నాట్లు వేశారు. ప్రస్తుతం పల్లపు ప్రాంతాల్లో నాట్లు ఊపందుకుకోవడంతో ఎక్కడ చూసినా రైతులు పొలం పనులతో బిజీగా కనిపిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో సుమారు 2 లక్షల ఎకరాల్లో చెరకు సాగు జరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామం బెల్లం, పంచదార ఉత్పత్తులకు మంచిదని చెబుతున్నారు.
     

మరిన్ని వార్తలు