జోరుగా తమిళ బియ్యం దందా

9 May, 2014 03:09 IST|Sakshi
  •     తమిళ బియ్యూనికి పాలిష్ వేసి అమ్మకాలు
  •      రైళ్లలో దర్జాగా సాగుతున్న దిగుమతి
  •      కూలికి పనిచేస్తున్న పేదలు
  •      కోట్లకు పడగలెత్తుతున్న పెద్దలు
  •  చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్:  తమిళనాడు పేద ప్రజలకు అక్కడి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం చిత్తూరు మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నారుు. ఈ బియ్యాన్ని చిత్తూరులోని కొందరు బడా వ్యాపారులు పాలిష్ చేసి మరీ బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.45 వరకు విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ వ్యవహారానికి చిత్తూరు రైల్వే స్టేషన్ కేంద్రంగా మారింది. ఈ వ్యాపారానికి కూలీనాలీ చేసి బతుకుతున్న పేదల్ని పావులుగా వాడుకుంటున్నారు.
     
    వేలూరు నుంచి దిగుమతి

    తమిళనాడులోని వేలూరు, చిత్తూరు మధ్య రోజూ పలు రైళ్లు నడుస్తున్నాయి. తమిళనాడులోని కొందరు దళారులు పేదల నుంచి ఉచిత బియ్యాన్ని కిలో ఒక్క రూపాయికి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని చిత్తూరులోని వ్యాపారులకు కిలో రూ.5 లెక్కన విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా చిత్తూరుతోపాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

    అది కూడా కిలో రూ.45 వరకు విక్రయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చిత్తూరు, తమిళనాడుకు చెందిన పలువురు పేద ప్రజల్ని బియ్యం వ్యాపారులు పావులుగా వాడుకుంటున్నారు. ఒక రోజుకు 15 కిలోల బియ్యాన్ని వేలూరు, కాట్పాడి ప్రాంతాల నుంచి భద్రంగా చిత్తూరు రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి  అందజేస్తే ఒక్కో మహిళకు కూలీ రూ.200 వరకు ఇస్తున్నారు. దీంతో ఎక్కువ మంది మహిళలు ఈ పనిపై ఆసక్తి చూపిస్తున్నారు.
     
    వెసులుబాటే అవకాశం

    రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఒకసారికి 20 కిలోల వరకు ధాన్యాన్ని తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న చిత్తూరు నగరానికి చెందిన కొందరు బియ్యం వ్యాపారులు రేషన్ బియ్యం రాకెట్ నడుపుతున్నారు. చౌకగా వచ్చే ప్రభుత్వ బియ్యానికి పాలిష్ వేసి మెరుగైన ధాన్యంగా ప్రజలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు. దీనిని పట్టించుకుని అక్రమ రవాణాను ఆపాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రధానంగా కొందరు అధికారులు, సిబ్బందికి అక్రమ వ్యాపారం చేస్తున్న వారి నుంచి నెలసరి మామూళ్లు వెళుతున్నాయని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
     
    రోగాల బారిన ప్రజలు

    పాలిష్ వేసిన తమిళనాడు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. బియ్యం పాలిష్ చేయడం ద్వారా దానిపై ఉన్న తృణపొరలు తరిగిపోతాయని, వాటిని వండుకుని తినడం ద్వారా శరీరానికి పోషక పదార్థాలు అందకుండా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు