బ్లడ్‌ అలెర్ట్‌!

25 Jun, 2019 10:11 IST|Sakshi
రక్తదాన శిబిరం (ఫైల్‌)

 మొదలైన ఎపిడమిక్‌ సీజన్‌

ప్రాణాంతక వ్యాధుల విజృంభణకు అవకాశం

నాలుగు నెలలు రెట్టింపు రక్తం అవసరం 

విశాఖపై పెనుభారం 

సాక్షి, విశాఖపట్నం: ఏదైనా ఆపద రానుందని తెలిస్తే అప్రమత్తంగా ఉండాలని రెడ్‌ అలెర్ట్‌ ప్రకటిస్తారు. ఇప్పుడు విశాఖకు ‘బ్లడ్‌’ అలెర్ట్‌ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. విశాఖపట్నంలో రోజురోజుకు రక్తానికి డిమాండ్‌ పెరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచే కాదు.. పొరుగు జిల్లాలు, పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రోగులు, క్షతగాత్రులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరికి అవసరమైన రక్తాన్ని ఇక్కడ ఉన్న బ్లడ్‌బ్యాంకులు సమకూరుస్తున్నాయి.

విశాఖలో శస్త్రచికిత్సలు, ప్రసవాలు, డెంగీ బాధితులు, అవయవ మార్పిడులు పెరుగుతున్నాయి. ఒకపక్క రక్తదాతలు పెరుగుతున్నా అంతకు మించి డిమాండ్‌ పెరుగుతోంది. ఇలా ఏటా 10 శాతం చొప్పున రక్తదాతల అవసరం పెరుగుతూ వస్తోంది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం జనాభాలో ఒక శాతం రక్తం నిల్వలు అవసరమవుతాయి.

జిల్లా జనాభా 44 లక్షలుంది. ఈ లెక్కన ఏటా 44 వేల యూనిట్ల రక్తం సరిపోతుంది. కానీ ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి విశాఖ వచ్చే రోగులు/క్షతగాత్రుల తాకిడితో ఇప్పుడు లక్ష యూనిట్లకు పైగా రక్తం కావలసి వస్తోంది. వీటిని సమకూర్చడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 

రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ..
విశాఖలో 17 బ్లడ్‌ బ్యాంకులున్నాయి. ఇవి పెరుగుతున్న రక్తం డిమాండ్‌కు అనుగుణంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాలేజీలతో ఈ బ్లడ్‌ బ్యాంకులు అవగాహన కుదుర్చుకున్నాయి. ఏటా రెండు సార్లు ఈ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తపు నిల్వలను సమకూర్చుకుంటున్నాయి.
 

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా విరివిగా రక్తదానానికి ముందుకొస్తున్నారు. ఇలా సగటున ఏటా 85 వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నాయి. ఒకసారి సేకరించిన రక్తం 30 రోజులకు మించి నిల్వ ఉండదు. అందువల్ల రక్త సేకరణ జరిగాక ఆ 30 రోజుల్లోగా వినియోగించకపోతే వృథా అయిపోతుంది. కొన్నిసార్లు ఎక్కువ రక్తం యూనిట్లు అవసరం పడడం, మరికొన్ని సార్లు అంతగా డిమాండ్‌ లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

ఏ ఏడాది సేకరణ  ఎంత ?

సంవత్సరం     యూనిట్లు
2016–17     82,390
2017–18     82,339
2018–19 97,626

మూడు నెలల్లో సేకరించిన యూనిట్లు

మార్చి     6,984
ఏప్రిల్‌ 6,314
మే 7,539 

2018 ఎపిడమిక్‌ సీజన్‌లో.. 

ఆగస్ట్‌  11,532
సెప్టెంబర్‌     11,150
అక్టోబర్‌ 6,418 

వ్యాధుల సీజన్‌ మొదలు..
వర్షాలతో పాటు వ్యాధుల సీజనూ మొదలవుతోంది. దోమకాటుతో డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభించనున్నాయి. వీటి బారిన పడిన వారికి ఒక్కసారిగా ప్లేట్‌లెట్‌లు పడిపోతాయి. వీరికి తక్షణమే రక్తం ఎక్కించి ప్రాణం కాపాడవలసి ఉంటుంది. వర్షాకాలం సీజన్‌లో విశాఖ నగరం, ఏజెన్సీలో ఏటా పెద్ద సంఖ్యలో ఈ జ్వర మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారికి ప్లేట్‌లెట్లు శరవేగంగా పడిపోయి. రోగి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. వీరికి రక్తం నుంచి ప్లేట్‌లెట్లను వేరు చేసి రోగికి ఎక్కిస్తారు.

కొన్ని జబ్బుల వారికి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, ఫ్రెష్‌ ఫ్రోజెన్‌ ప్లాస్మా వంటివి అవసరమవుతాయి. వీటిని కూడా రక్తం నుంచి సెపరేట్‌ చేసి అవసరమైన వారికిస్తారు. మిగిలిన రక్తాన్ని హిమోగ్లోబిన్‌ అవసరమున్న వారికిస్తారు. ఏజెన్సీలో రక్తహీనత, తలసేమియా, ఎనీమియా, సికిల్‌సెల్‌ వంటి వ్యాధులతో బాధపడే వారు అధికంగా ఉంటారు. వీరికి రక్తం ఎక్కించి ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. ఇప్పుడు వ్యాధుల సీజను ప్రారంభం కావడంతో మరో నాలుగు నెలల పాటు రెట్టింపు రక్తపు నిల్వలు కావలసి ఉంటుంది.

సాధారణ రోజుల్లో నెలకు ఐదారు వేల యూనిట్ల రక్తం అవసరం ఉండగా ఈ ఎపిడమిక్‌ సీజనులో రెట్టింపు సంఖ్యలో అంటే.. 12 వేల యూనిట్ల రక్తం అవసరమవుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో 22 వేలకు పైగా యూనిట్ల రక్తం నిల్వ ఉంది. 

కొరత రాకుండా చూస్తున్నాం
విశాఖ ఆస్పత్రులకు రక్తం అవసరం ఉండే రోగులు, క్షతగాత్రులు ఎక్కువగా వస్తుంటారు. రక్తదాతల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి తక్షణమే సమకూర్చే చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీ విద్యార్థులే కాదు.. 80 శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. వ్యాధుల సీజన్‌ ప్రారంభం కావడంతో డెంగీ తదితర రోగులకు సరిపడినన్ని ప్లేట్‌లెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. పాడేరులో త్వరలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటవుతోంది. అక్కడున్న బ్లడ్‌ స్టోరేజి యూనిట్‌ను ముంచంగిపుట్టుకు తరలిస్తాం. జిల్లాలో మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వాహనాన్ని నర్సీపట్నం, అనకాపల్లిల్లో అందుబాటులో ఉంచాం. ఎపిడమిక్‌ సీజన్‌లో రక్తం కొరత రాకుండా అప్రమత్తంగా ఉన్నాం.  

   – రోణంకి రమేష్, ఏడీఎంహెచ్‌వో 

మరిన్ని వార్తలు