చంద్రయాన్‌- 2 వాయిదా

15 Jul, 2019 02:51 IST|Sakshi
శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 -ఎం1 రాకెట్‌

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 -ఎం1 రాకెట్‌లో సాంకేతిక లోపం.. అర్ధరాత్రి తర్వాత కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిలిపివేత

త్వరలో కౌంట్‌డౌన్‌ తేదీని ప్రకటిస్తామన్న ఇస్రో అధికారులు

శ్రీహరికోట/సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత పదేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కఠోర శ్రమ చేసి రూపొందించిన చంద్రయాన్‌-2 ప్రయోగం సాంకేతిక కారణాల కారణంగా ఆదివారం అర్థరాత్రి వాయిదా పడింది. సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-3 ఎం–1 రాకెట్‌లో మూడో దశలో సాంకేతిక లోపం కారణంగా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆదివారం ఉదయం 6.51 నిమిషాలకు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ ఆధ్వర్యంలో కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ప్రయోగానికి 56.24 నిమిషాల ముందుగా అంటే1.55 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. రాకెట్‌లో అత్యంత కీలక దశగా ఉన్న మూడో దశలో క్రయోజనిక్‌ ఇంజిన్‌కు సంబంధింన బ్యాటరీలు చార్జ్‌ కాకపోవడంతో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలు స్తోంది. దీంతో పాటు క్రయోజనిక్‌లో ఉండే గ్యాస్‌ బాటిల్‌ లీకేజీ రావడం కూడా సాంకేతిక లోపానికి మరో కారణంగా గుర్తించారు. దీంతో ప్రస్తుతానికి ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ విధమైన సాంకేతిక లోపం గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు ఈ లోపం జరిగిందో దానిపై ఆత్మ విమర్శ చేసుకుంటున్నారు. కాగా, చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని సెప్టెంబర్‌ 9న నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

‘షార్‌’కు రాష్ట్రపతి : భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వీక్షించడానికి ‘షార్‌’కు వచ్చారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన రేణిగుంట నుంచి షార్‌ కేంద్రానికి చేరుకున్నారు. షార్‌లోని హెలీప్యాడ్‌ వద్ద ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె. శివన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎ.రాజరాజన్‌, జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అక్కడ నుంచి నక్షత్ర అతిథిగృహానికి చేరుకున్నారు. అనంతరం 7 గంటలకు చంద్రయాన్‌-2 ప్రయోగానికి సంబంధించిన రెండో ప్రయోగ వేదిక వద్దకు చేరుకుని జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ను సందర్శించారు. ఆ తరువాత షార్‌లో సుమారు రూ.650 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

60 ఏళ్లుగా పరిశోధనలు..
చంద్రుడి గురించి తెలుసుకోవడానికి గడిచిన 60 ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు ఇప్పటివరకు 125 ప్రయోగాలు చంద్రుడి పైనే చేశాయని ఐక్యరాజ్య సమితి వెల్లడిస్తోంది. ఆ వివరాలు..

  • 1958 నుంచి అమెరికా చంద్రుడిపై పరిశోధనలను ప్రారంభించింది. 12 ప్రయోగాలు చేసిన తరువాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి చేరుకుంది. అలా ఇప్పటిదాకా 58 ప్రయోగాలు చేసి 41
  • ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 1969లో అపోలో రాకెట్‌ ద్వారా నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఆల్డ్ర్‌న్‌, మైఖేల్‌ పోలీన్స్‌ అనే ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించిన ఘనత అమెరికా పేరు మీదే వుంది.
  • ఇక రష్యా కూడా 1958 నుంచి 53 ప్రయోగాలు చంద్రునిపైకి చేసింది. అందులో 35 మాత్రమే విజయవంతమయ్యాయి.
  • జపాన్‌ అయితే 1990 నుంచి ఆరు ప్రయోగాలు సొంతంగా, ఒక్క ప్రయోగం నాసాతో కలిసి చేసింది. ఇందులో ఐదు విజయవంతమయ్యాయి.
  • 2010 నుంచి చైనా కూడా ఏడు ప్రయోగాలు చేయగా ఒక్క ప్రయోగం ద్వారా మాత్రమే చంద్రుని దాకా వెళ్లగలిగింది.
  • ఇజ్రాయిల్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రునిపైకి ల్యాం డర్‌ను పంపించినా అది విజయవంతం కాలేదు.
  • జర్మనీ 2003లో చంద్రుని మీదకు ఆర్బిటర్‌ను విజయవంతంగా పంపించింది.
  • భారత్‌ విషయానికొస్తే 2008లో చంద్రుడి మీదకు ఆర్బిటర్‌ను ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని కనుగొంది.

ఈ దేశాలన్నీ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగాలు చేసినపప్పటికీ ప్రధానంగా అమెరికా, రష్యాలే ఈ రంగంలో ఇప్పటికీ పోటీపడుతున్నాయి. తాజాగా.. భారత్‌ రెండోసారి ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు