కరెంట్ కాటు

4 Aug, 2013 04:31 IST|Sakshi

అందరికీ అన్నం పెట్టే అన్నదాత మృత్యుకోరల్లో చిక్కుకుంటున్నాడు. వెలుగులు ప్రసరించే కాంతి తీగలు యమపాశాలై కాటేస్తున్నాయి. అసలే వర్షాకాలం కావడంతో విద్యుత్ ప్రమాదాలు పెరిగి కుటుంబంలో పెద్ద దిక్కును దూరం చేస్తున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. రైతుల అవగాహన లోపం.. వెరసి నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పదే..పదే ఈ ప్రమాదాలు అధికారులను వెక్కిరిస్తున్నా నివారణ చర్యలు మాత్రం కంటి తుడుపుగా కూడా కానరావడం లేదు. గడిచిన రెండు రోజుల్లో పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్‌తో జిల్లాలో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు.
 
 జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లో వి ద్యుత్ వ్యవస్థ అధ్వానంగా ఉం డడంతో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలోపం, సిబ్బం ది నిర్లక్ష్యం ఫలితంతోపాటు రైతుల అవగాహన లోపం ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
 
 విద్యుత్ స్తంభాల మధ్య దూరం పెరగడం, పొలాల్లో సపోర్టు తీగలు తీసేయడం, రైతులు స్వయంగా మరమ్మతు పనులు చేపట్టడం, నాసిరకం స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద కంచె లేకపోవడం, స్తంభం నుంచి మోటార్‌కు సరఫరా అయ్యే వైర్లు సరిగా ఉండకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అరుునా సంబంధిత అధికారులు మాత్రం కనీస నివారణ చర్యలు చేపట్టడం లేదు. రైతులకు విద్యుత్ వినియోగం,తదితర చర్యలపై అవగాహన కల్పించడంలో విఫలమవుతూనే ఉన్నారు.
 
 ప్రాణాలకు ‘టారిఫ్’ పరిహారం
 విద్యుత్‌షాక్‌తో మరణించిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం టారిఫ్ విధానాన్ని అమలుచేస్తోంది. చనిపోయిన వారిలో పెద్దవారికి రూ.లక్ష , మైనర్లకు రూ.50 వేలుగా నిర్ణయించింది. ఇందులో మూగజీవాలకు రూ.3 వేలు మాత్రమే మంజూరు చేస్తోంది. జిల్లాలో 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 220 మంది రైతులు మృతిచెందగా... 400కు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ వారం రోజుల్లోనే చిగురుమామిడి మండలం రేకొండలో పిట్టల రాజయ్య(65), గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన ఏలేటి చొక్కయ్య(60), వీణవంక మండలంలో గేదెలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి కమలాకర్‌రెడ్డి అనే బాలుడు మరణించారు.
 
 శనివారం కమాన్‌పూర్ మండలం రొంపికుంట పరిధి తెనుగుపల్లెలో తాళ్ల లచ్చులు(40) అనే రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. గతంలో చనిపోయిన వారిలో సగానికి పైగా పరిహారం అందకపోవడంతో వారి కుటుంబాలు ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డునపడ్డ కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించడంలో కొర్రీలు పెడుతూ మొక్కుబడిగా అందజేస్తోంది.
 
 పమాదాల నివారణకు జాగ్రత్తలు
 వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలు, స్టార్టర్లు, మోటార్లను తాకరాదు.
 
 వేలాడుతున్న కరెంటు తీగల గురించి, లైన్లకు చెట్ల కొమ్మలకు మంటలు లేస్తే అధికారులకు తెలపాలి. లూజు వైర్లున్నా దగ్గరలోని విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి.
 
 రైతులు పంపు సెట్లను వినియోగించుకున్నప్పుడు కరెంట్ మోటార్లు, పైపులు, పుట్ వాల్వ్‌లను అజాగ్రత్తతో తాకకూడదు. పొరపాటున కరెంటు ప్రసారం జరిగి ప్రమాదం సంభవించే అవకాశముంది.
 
 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అనధికారికంగా ఫ్యూజులు మార్చడం, కాలిపోయిన తీగలు సరిచేయడం ప్రమాదకరం.
 
 సర్వీస్ వైర్లను, వీధి దీపాలను సరిచేసేందుకు ఇతరులు విద్యుత్ స్తంభాలు ఎక్కరాదు. సంస్థ సిబ్బంది, సాయం కోరడం తప్పనిసరిగా పాటించాలి.
 
 కాలిపోయిన విద్యుత్ మోటారు రాగి తీగలను(కాపర్ వై రు), సిమెంటు స్తంభం, కలప స్తంభం నుంచి గానీ విద్యుత్ మోటార్‌కు సర్వీసు వైరుగా ఉపయోగించకూడదు.
 
 వ్యవసాయ మోటార్లకు సింటెక్ ప్యానల్ బాక్స్ వినియోగిస్తే వర్షపు నీరు అందులో పోకుండా విద్యుదాఘాతం తప్పడంతోపాటు బాక్స్ తుప్పు పట్టదు.
 
 ప్రభుత్వం వారు వేసిన విద్యుత్ స్తంభాల నుంచి మాత్రమే మోటార్‌కు కనెక్షన్ తీసుకోవాలి.
 ఎండకు, వానకు, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే ఐఎస్‌ఐ మార్కు ఉన్న సర్వీసు వైర్లు మాత్రమే వాడాలి.
 
 జాయింట్ చేసిన వైర్లను, భూమిపైగానీ, పొలంలో గానీ, కాలువలో నుంచి గానీ తీసుకునిపోరాదు.
 
 చెడిపోయిన మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్, ఫ్యూజులను సొంతంగా రిపేరు చేయకూడదు. కింద తెగి పడిన కరెంటు తీగలను తాకకుండా విద్యుత్ శాఖ అధికారులకు తెలపాలి. లేదా అధీకృత విద్యుత్ తనిఖీ శాఖ లెసైన్సు పొందిన వారితోనే పని చేయించాలి.
 
 పాదరక్షలు లేకుండాగానీ, తడి చేతులతో గానీ విద్యుత్ మోటార్లను, ట్రాన్స్‌ఫార్మర్లు, ఏ విద్యుత్ పరికరాలను ముట్టుకోరాదు.
 

మరిన్ని వార్తలు