దేశం ‘కోట’లో అంతర్యుద్ధం

23 Jan, 2014 06:23 IST|Sakshi
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీకి జిల్లాలో కంచుకోటగా ఉన్న ఎస్.కోటలో అంతర్యుద్ధం మొదలయింది. టికెట్ కోసంప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలయిన ఇద్దరు మహిళామణులు పోటీ పడుతుండడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో ఎస్.కోట శాసనసభ స్థానం నుంచి పోటీచేసేందుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం రాష్ట్ర మహిళాధ్యక్షురాలు శోభా హైమావతి, ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
 
 నిన్నమొన్నటి వరకూ కలిసిమెలిసి..
 లోలోపల ఏమున్నా ఇటీవల కాలం వరకూ  పార్టీ కార్యక్రమాల్లో కలిసిమెలిసి పాల్గొన్న ఎమ్మెల్యే లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే హైమావతి  మధ్య  పోరు ప్రారంభమయింది. ఎస్.కోట శాసనసభ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ ఇద్దరూ సిద్ధమవుతున్నారు.    కొంతకాలంగా  వీళ్లిద్దరూ ఎవరికి వారే చాపకింద నీరులా  తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం వారు తమ వర్గాలను సమాయత్తం చేసి, తమ బలం చాటుకుని, అధిష్టానం ఆశీస్సులు పొందేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు ఎవరికి వారు విడివిడిగా పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేశారు.   
 
 టికెట్‌పై ఎవరి ధీమా వారిదే...
 ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఎమ్మెల్యే లలితకుమారి గ్రామాల్లో పార్టీ ప్రచారం జోరు పెంచారు. ఈ సందర్భంగా ఆమె ఈ దఫా పార్టీ టికెట్ తనకే వస్తుందని, చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని  చెబుతున్నారు. ఈ ప్రచారంతో చిర్రెత్తుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే హైమావతి  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ టికెట్ ఎవ్వరికీ ప్రకటించలేదని, అధిష్టానం సరైన సమయంలో అభ్యర్థిని ప్రకటిస్తుందని, అ వాస్తవాలతో పార్టీ క్యాడర్‌లో గందరగోళం సృష్టించడం సరికాదంటూ ఎమ్మెల్యే లలితకుమారికి అటాక్ ఇచ్చారు. దీంతో నిన్నటి వరకూ వీరి మధ్య సాగిన కోల్డ్‌వార్ ఇప్పుడు బహిర్గతమయింది. వెలమ సామాజిక వర్గానికి  ఎస్.కోట స్థానం కేటాయిస్తారని, 2009లో రాజన్న హవాను తట్టుకున్న లలితకుమారిని కాదని టికెట్ వేరెవరికీ ఇవ్వరంటూ లలితకుమారి వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన హైమావతి పనితీరు, ప్రజాఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడం, పార్టీక్యాడర్‌పై మంచి పట్టుఉన్నందున సామాజిక వర్గాలకు అతీతంగా హైమావతికి టికెట్ వస్తుందని, ఇప్పటికే పార్టీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఆమె వర్గీయులు చెబుతున్నారు.  
 
 అయోమయంలో పార్టీక్యాడర్ :
 ప్రజాదరణ తగ్గడం, క్యాడర్ పార్టీకి దూరంగా వెళ్లడం, రెండోస్థాయి లీడర్లంతా ఈ దఫా ఎన్నికల్లో పార్టీ మారేందుకు యత్నించడం, జిల్లాలో పలు స్థానాల్లో పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు, రెబల్స్‌తో అవస్థలు పడుతున్న చంద్రబాబుకు ఎస్.కోట మరో సమస్య అయింది. లలితకుమారి, హైమవతిల్లో ఎవరిని కాదన్నా పార్టీ కొంత బలగాన్ని, వర్గాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఈ పరిణామాలతో  ఎస్.కోట స్థానాన్ని చేజేతులా వదులుకోవాల్సి వస్తుందన్న గుబులు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎవరి వైపు వెళ్తే భవిష్యత్‌లో ఏ ఇబ్బందులు ఎదురవుతాయో అన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. 
 
>
మరిన్ని వార్తలు