డుంబ్రిగుడ స్టేషన్‌ C/o అరకులోయ

4 Oct, 2018 07:10 IST|Sakshi
అరకులోయలో నిర్వహిస్తున్న డుంబ్రిగుడ పోలీసుస్టేషన్‌

మావోయిస్టుల భయం వల్లే అరకులోయకు తరలింపు

23 ఏళ్లుగా ఆ మండలానికి అందుబాటులో లేని ఠాణా

విశాఖపట్నం,డుంబ్రిగుడ(అరకులోయ): మావోయిస్టుల భయం కారణంగా ఏకంగా రెండు దశాబ్దాలకుపైగా డుంబ్రిగుడ మండల ప్రజలకు పోలీస్‌స్టేషన్‌ అందుబాటులో లేకుండా పోయింది. 23 ఏళ్ల క్రితం డుంబ్రిగుడ మండల కేంద్రం నుంచి అరకులోయకు పోలీస్‌స్టేషన్‌ను తరలించారు.దీంతో  ఈ మండల వాసులు ఫిర్యాదులు చేసేందుకు  మండల కేంద్రం నుంచి 16 కిలో మీటర్ల దూరంలో గల  అరకులోయకు వెళ్లవలసి వస్తోంది. డుంబ్రిగుడ మండల కేంద్రంలో 1991 సంత్సరంలో పోలీసు స్టేషన్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి డుంబ్రిగుడ నుంచి గుంటసీమ వెళుతున్న మార్గం సమీపంలో గల మర్రిచెట్టు కింద ఉన్న భవనంలో కొంత కాలం  పోలీసు స్టేషన్‌ నిర్వహించారు. అక్కడ  మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండడంతో   అరకు–పాడేరు ప్రధాన రోడ్డు పక్కన ఉన్న భవనంలోకి ఈ స్టేషన్‌ను మార్చారు. మళ్లీ మావోయిస్టుల భయంతోనే  1995 సంవత్సరంలో ఈ పోలీసు స్టేషన్‌ అరకులోయ మండల కేంద్రానికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే నిర్వహిస్తున్నారు.  

ఫిర్యాదుదారుల అవస్థలు
డుంబ్రిగుడ మండల కేంద్రంలో పోలీసుస్టేషన్‌ లేక పోవడంతో  18 పంచాయతీల గిరిజనులు  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే  మండల కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తోందని మండలవాసులు వాపోతున్నారు.

సందర్శనతో సరి..
డుంబ్రిగుడ మండల కేంద్రంలో  పోలీసు స్టేషన్‌ ప్రారంభించేందుకు ఐదేళ్లక్రితం  గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలో భవన నిర్మాణం చేపట్టారు. పలుమార్లు  పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి, భవనాన్ని పరిశీలించారు. కానీ   స్టేషన్‌ను ప్రారంభించే చర్యలు తీసుకోలేదు.  ఇక్కడ పోలీసుల  నివాస గృహాలు లేవు. ఇక్కడ పోలీసు సిబ్బందికి రక్షణ ఉండదన్న కారణంగా స్టేషన్‌ ఏర్పాటులో జాప్యం చేస్తున్నారని సమాచారం.   

ఏర్పాటు ఏప్పుడో ?
డుంబ్రిగుడలో పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని చాలా రోజుల నుంచి పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే కార్యరూపం దాల్చడం లేదు.   గత నెల 23న  మండలంలో పోతంగి పంచాయతీ లివిటిపుట్టు గ్రామ సమీపంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేశారు. ఈనేపథ్యంలోనైనా ఇక్కడ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తారా ? లేదా ? అని మండల వాసులు ప్రశ్నిస్తున్నారు.  డుంబ్రిగుడలో పోలీసు స్టేషన్‌ ఉంటే ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదేమోనని వారు అంటున్నారు.  

ఆదేశాలు వస్తే...
పోలీసు స్టేషన్‌ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేస్తే స్టేషన్‌ను డుంబ్రిగుడ మండలకేంద్రానికి తరలిస్తాం.   – వెంకినాయుడు, అరకు సీఐ.

మరిన్ని వార్తలు