పరిశుభ్ర పల్లెలు..

25 Jan, 2014 02:39 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించడానికి మరో అవకాశం. ఇప్పటివరకు మున్సిపాలిటీల్లోనే ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తారని తెలుసు. ఇటువంటిదే ఇకపై పల్లెల్లో జరగనుంది. ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.

దీనికి తోడు గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కలిగింది. అపరిశుభ్రత వల్లే ముఖ్యంగా వ్యాధులు సంభవిస్తున్నాయని వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. చెత్తాచెదారమంతా యార్డుల్లో వేసేలా చర్యలు తీసుకుంటుంది. పల్లెల అభివృద్ధికి పాటుపడాలనుకున్న సర్పంచ్‌లకు ఇది చక్కని అవకాశం.

 ఏర్పాటు ఇలా...
 ప్రతి గ్రామపంచాయతీకో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోవచ్చు. పంచాయతీకి/ప్రభుత్వానికి చెందిన 7 గుంటల స్థలం ఆ గ్రామానికి 500మీటర్ల నుంచి కిలోమీటరు దూరంలో ఉంటే సరిపోతుంది. ఇది ఎత్తై ప్రదేశంలో ఉండాలి. తద్వారా వర్షాలు కురిసినప్పుడు వర ద రాకుండా చూసుకోవచ్చు. 9మీటర్ల వెడల్పు, 15 మీటర్ల పొడవు, 2మీటర్ల లోతు గుంత తవ్వుతారు. ఈ పనంతా ఉపాధి కూలీల ద్వారానే చేయిస్తారు.

ఇందులోకి రిక్షా/తోపుడు బండ్లు వెళ్లి చెత్త వేయడానికి వీలుగా ర్యాంపు నిర్మిస్తారు. గుంత తవ్వగా వచ్చిన మట్టిని నీళ్లు లోనికి వెళ్లకుండా ఒక కట్టలా పోస్తారు. పూర్తిస్థాయిలో డంపింగ్ యార్డు నిర్మాణానికి రూ 1.32 లక్షలు ఉపాధి పథకం ద్వారా ఖర్చుచేస్తారు. గుంత తవ్వకానికి రూ 91వేలు, మెటీరియల్‌కు రూ 7,152, చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలింపునకు రూ 33 వేలు ఖర్చు చేస్తుంది.

 నిర్వహణ తీరు..
 ఇంటింటా చెత్తాచెదారం సేకరించడానికి ఉపాధి హామీ పథకం ద్వారా ఇద్దరు కూలీలను సమకూర్చుతారు. వీరు వారంలో రెండు లేదా మూడు సార్లు ఇల్లిల్లూ తిరిగి చెత్త పోగు చేస్తా రు. దీన్ని రిక్షా/తోపుడు బండి ద్వారా తరలించి డంపింగ్ యార్డులో పోస్తారు. చెత్త సేకరించినందుకు ఒక్కో కూలీకి రోజుకు రూ149 చెల్లిస్తారు. ఇలా ఏడాదిలో 180 పనిదినాలకు ఉపాధి లభిస్తుంది. ఒక్కో పంచాయతీలో చెత్త సేకరణకు ఇద్దరు కూలీలను ఏర్పాటు చేసుకుంటే ఏడాదిలో ఒక్కొక్కరికి 90 రోజులపాటు పని లభిస్తుంది. తద్వారా 13వేల రూపాయలకు పైగా కూలి లభిస్తుంది.

అంతేగాక పోగుచేసిన చెత్తను డంపింగ్ యార్డుకు చేర్చినందుకు రూ 7వేలు కూడా చెల్లిస్తారు. పోగు చేసిన చెత్తచెదారం ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. డంప్ యార్డు నిండిన తర్వాత దాన్ని ఎరువుగా వేలం పాట ద్వారా ఇతరులకు విక్రయిస్తే ఎంతోకొంత డబ్బులు వస్తాయి. వీటిని గ్రామాభివృద్ధికి ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు