సంచి కథ కంచికేనా?

21 Sep, 2018 06:45 IST|Sakshi

రూ.18 లక్షల గోనె సంచుల గల్లంతుపై తేలని లెక్క

రికార్డుల్లో మూడు పేజీలు మాయం

మిల్లర్లు, నిర్వాహకుల పాత్రపై అనుమానాలు

మూడేళ్లుగా పలుమార్లు విచారణ

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు

కొలిక్కిరాని గల్లంతు వ్యవహారం

డ్వాక్రా మహిళలకు కమీషన్‌ నిలిపి వేసిన పౌర సరఫరా అధికారులు

తూర్పుగోదావరి, మండపేట:  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడేళ్లుగా సుమారు రూ.18 లక్షల విలువైన గోనె సంచుల గోల్‌మాల్‌ వ్యవహారంపై లెక్క తేలడం లేదు. పలుమార్లు విచారణ జరిపిన ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో సంచి కథను కంచికి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విచారణ నివేదిక ఉన్నత స్థాయికి చేరకుండా అడ్డుకుంటున్నట్టు సమాచారం. గోనెసంచుల గల్లంతుతో డ్వాక్రా మహిళలకు అందాల్సిన ధాన్యం కొనుగోలు కమీషన్‌ దాదాపు రూ.20 లక్షలను పౌర సరఫరా అధికారులు నిలిపివేశారు.

2015–16 ఆర్ధిక సంవత్సరానికిగాను వెలుగు ఆధ్వర్యంలో మండపేట మండలంలోని అర్తమూరు, ద్వారపూడి, మండపేట, జెడ్‌ మేడపాడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు కోసం పౌర సరఫరాల శాఖ నుంచి దాదాపు 10.46 లక్షల గోనె సంచులు అందజేశారు. ఆయా సంచులను కొనుగోలు కేంద్రాల్లోనే ఉంచాల్సి ఉంది. మద్దతు ధరకు మించి మిల్లర్లు కొనుగోలు చేయడంతో అధిక శాతం మంది రైతులు నేరుగా మిల్లులకే విక్రయించేశారు. ఒక పర్యవేక్షణాధికారి, కొందరు మిల్లర్లు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయాలు చేసినట్టు తప్పుడు రికార్డులు సృష్టించడంతోపాటు గోనె సంచులను మిల్లులకు తరలించేసినట్టు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ రికార్డుల మేరకు 28,400 సంచులు ఉండాల్సి ఉండగా దాదాపు 3,500 సంచులు మాత్రమే ఉన్నట్టు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. సుమారు రూ.18 లక్షల విలువైన సంచులు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు.

గోనె సంచుల గల్లంతుపై గతంలో ‘సాక్షి’ దిన పత్రికలో వచ్చిన కథనాలపై అధికారులు స్పందించారు. మే నెలలో ద్వారపూడి మహిళా సమాఖ్య భవనంలో తహసీల్దార్‌ వి.సీత, పోలీసుల సమక్షంలో అప్పటి డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు కేంద్రం నిర్వాహకులను, అప్పటి సిబ్బందిని విచారించారు. కేంద్రం నిర్వహణకు సంబంధించిన పాత రికార్డులను పరిశీలించగా ఒక రికార్డులో మూడు పేజీలు లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే రికార్డుల కోసం ద్వారపూడి వెలుగు పీపీసీ పేరిట ఒక స్టాంపును మాత్రమే వినియోగించాల్సి ఉండగా ద్వారపూడి వెలుగు ఇన్‌చార్జి, ద్వారపూడి పీపీసీల పేరుతో స్టాంపులు వేసి ఉండటాన్ని ఆయన గుర్తించారు. ఇష్టారాజ్యంగా స్టాంపులు తయారు చేయించుకుని రికార్డులు నిర్వహించడంపై కేంద్రం నిర్వాహకుల నుంచి స్టేట్‌మెంట్లు నమోదు చేసుకున్నారు. సీజన్‌ ప్రారంభం, ముగింపు సందర్భంగా సంచుల ఓపెనింగ్, క్లోజింగ్‌ బ్యాలెన్స్‌లలో వ్యత్యాసంపై ఆయన ఆరా తీశారు. ఆ విచారణ మరుగున పడిపోగా తాజాగా నెల రోజుల కిందట మరోమారు డీఆర్‌డీఏ అధికారులు విచారణ నిర్వహించారు. ఈ నివేదిక ఉన్నతాధికారులకు అందకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

డ్వాక్రా సంఘాలకు అందని కమీషన్‌
గోనె సంచుల గల్లంతు నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ద్వారా డ్వాక్రా సంఘాలకు అందాల్సిన కమీషన్, నిర్వహణకు సంబంధించిన బిల్లులు మొత్తం దాదాపు రూ.25 లక్షలు విడుదల చేయకుండా పౌర సరఫరాల అధికారులు నిలుపు చేశారు. కొందరు అక్రమార్కుల కారణంగా డ్వాక్రా సంఘాలకు అందాల్సిన కమీషన్‌ ఆగిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. గోనె సంచుల గల్లంతు వ్యవహారానికి సంబంధించి బాధ్యులైన వారి నుంచి రికవరీ చేసి డ్వాక్రా సంఘాల కమీషన్‌ సొమ్ములు అందజేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఏపీఎం సుప్రియను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు.

మరిన్ని వార్తలు