8.74 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు

30 Sep, 2013 03:39 IST|Sakshi
 సాక్షి, రంగారెడ్డి జిల్లా: నూతన ఓటరు జాబితా రూపకల్పన జిల్లా యంత్రాంగానికి కష్టంగా మారుతోంది. ముఖ్యంగా డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు, తొలగింపు ప్రక్రియ అధికారులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. వచ్చేనెల 3న ఓటరు ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంది. ఈ లోపు డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు, ఓటర్ల మార్పులు, చేర్పుల ప్రక్రియ పూర్తి చేస్తే కొత్త జాబితా తయారీ ప్రక్రియ సులభతరమయ్యేది. అయితే జిల్లాలో భారీగా డూప్లికేట్ ఓటర్లున్నట్లు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ గుర్తించింది. అధికారుల తాజా లెక్కల ప్రకారం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 8,74,556 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. అయితే ప్రత్యేక పరిశీలన చేపట్టి వీరంతా అసలా... లేక డూప్లికేటా అనే అంశాన్ని రెవెన్యూ యంత్రాంగం తేల్చాల్సి ఉంది.
 
 నత్తనడకన ‘పరిశీలన’
 డూప్లికేట్ ఓటర్లుగా భావిస్తున్న వారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాల్సిందిగా జిల్లా యంత్రాంగం మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదంత సులువైంది కాదని రెవెన్యూ అధికారులు ప్రక్రియను కొంతకాలం పెండింగ్‌లో ఉంచారు. ఇటీవల జిల్లాలో ఓటరు జాబితా ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల కమిషన్.. డూప్లికేట్ల పరిశీలన పెండింగ్‌లో ఉండటంపై అసహనం వ్యక్తం చేసింది. వెంటనే పరిశీలన చేపట్టాలంటూ పక్షం రోజుల క్రితం ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
 
 దీంతో అధికారులు క్షేత్రపరిశీలనకు ఉపక్రమించారు. జిల్లాలో గ్రామీణ నియోజకవర్గాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే డూప్లికేట్ల సంఖ్య పెద్దఎత్తున ఉండడంతో పరిశీలన ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో లక్షకుపైగా డూప్లికేట్ ఓటర్లున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో వేలల్లో ఉన్నప్పటికీ.. సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో పరిశీలన నత్తనడకన సాగుతోంది. దీంతో ముసాయిదా ప్రకటించే నాటికి ఈ పరిశీలన ఏ మేరకు పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకమే.!
 
>
మరిన్ని వార్తలు