‘గుడి చైర్మన్‌ అయినా.. క్యూలైన్లో రావాల్సిందే’

16 Oct, 2018 16:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ:  దుర్గగుడి చైర్మన్‌ యలమంచలి గౌరంగబాబుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారి దర్శనానికై గౌరంగబాబు కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చారు. అయితే ప్రత్యేకదర్శనార్థం ఆలయంలోకి నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించగా ఈవో కోటేశ్వరమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. శరన్నవరాత్రుల్లో చైర్మన్‌ అయినా క్యూలైన్లో రావాల్సిందేనని సూచించారు. దీంతో ఆగ్రహించిన గౌరంగబాబు ఆలయం వద్దే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాలకమండలి సభ్యులు నచ్చచెప్పినా వినకుండా అక్కడే బైఠాయించారు. చివరకు ఈవో కోటేశ్వరమ్మ వచ్చి నేరుగా ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పడంతో గౌరంగబాబు నిరసన విరమించారు. ఈ దసరా ఉత్సవాల్లో చైర్మన్‌కు ఇలాంటి ఘటన ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. 

ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రం రోజు జరిగే విశేష పూజలో ఈవో, కమిషనర్, దేవాదాయశాఖ కమిషనర్, దుర్గగుడి చైర్మన్‌లకు తొలి పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే పోలీసుల అత్యుత్సాహంతో చైర్మన్‌ను తొలి పూజకు వెళ్లకుండా చేశారు. తాను గుడి చైర్మన్‌ అని చెప్పుకున్నప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలంటూ ఆపేశారు. తీవ్ర మనస్థాపంతో ఇంటికి వెళ్లిన చైర్మన్‌కు తిరిగి ఉదయం కూడా అదే సంఘటన ఎదురైంది. ఉదయం 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన గౌరంగబాబును దర్శనానికి వెళ్లకుండా డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తాను ఆలయ చైర్మన్‌ను అంటూ పదేపదే చెప్పినా ఫలితం లేకుండా పోయింది. 
 

మరిన్ని వార్తలు