వివాదాల కీలాద్రి!

29 Dec, 2018 13:11 IST|Sakshi

ఏడాదిలో నలుగురు ఈవోలు మార్పు

దేవాలయం ప్రతిష్ట దెబ్బతీసిన పాలక మండలి

చిన్నారి మిస్సింగ్, మహిళల డ్రసింగ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు

ఈవో, ఏఈవో మధ్య వార్‌ దుర్గగుడిపై ఏడాది రౌండప్‌

రాజకీయ జోక్యం అధికం కావడం.. అధికారుల మధ్య ఆధిపత్య పోరు.. పాలకవర్గం పెద్దల చర్యలు వెరసి ఇంద్రకీలాద్రిపై వ్యవహారాలు 2018లో భక్తుల మెప్పు పొందలేకపోయాయి. వివిధ కారణాలతో నలుగురు ఈవోలను మార్చడం.. అభివృద్ధి పనుల అంశంగా ఎవరి ధోరణి వారిదన్నట్లు నడుచుకోవడం  ఇబ్బందికర పరిస్థితులకు దారితీశాయి. పవిత్ర దుర్గగుడి వ్యవహారాల్లో వర్గపోరుకు పాలకపక్షం ఆజ్యం పోసిందన్న విమర్శలు మిన్నంటాయి.

సాక్షి, విజయవాడ :  దుర్గగుడిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వివాదాలు  జరిగాయి. దేవస్థానం పాలకమండలి సభ్యుల చర్యల వల్ల దేవస్థానం ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తింది. ఒకే ఏడాది నలుగురు ఈవోలను మార్చి దేవస్థానం అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందనే విమర్శలు వినిపించాయి. దేవస్థానంలో నాయీబ్రాహ్మణులు రోడ్డెక్కి ధర్నా చేసి చివరకు ముఖ్యమంత్రిని నిలదీసే పరిస్థితి ఏర్పడింది.

ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు
ఐటీ మంత్రి నారా లోకేష్‌ కోసం గత ఏడాది డిసెంబర్‌ 26వ తేదీ అర్ధరాత్రి  దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని పత్రికలు కోడై కూశాయి. ఈ అంశం వివాదం కావడంతో ఈ ఏడాది జనవరి 7న అప్పటి ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటుపడింది. అయితే దీనిపై జరిగిన విచారణలో వెల్లడైన వాస్తవాలను ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టలేదు.

ఈవో వర్సెస్‌ ఏఈవో..
దసరా ఉత్సవాల్లో జరిగిన జ్ఞాపికల స్కాం చివరకు ఏఈవో అచ్యుతరామయ్య సస్పెక్షన్‌ వరకు వెళ్లింది. దీంతో ఈవో కోటేశ్వరమ్మకు, ఏఈవో అచ్యుతరామయ్యకు మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఏఈవో అచ్యుతరామయ్య తనను బెదిరించారంటూ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఈవో నియామకం చెల్లదంటూ ఏఈవో కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చివరకు ఆలయ చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు జోక్యంతో ఏఈవోనే ఒకడుగు దిగి వచ్చి ఈవో కోటేశ్వరమ్మకు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

భక్తులకు సౌకర్యాలు..
ప్రస్తుతం దుర్గగుడి నిధులు తరిగిపోవడంతో భక్తుల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఘాట్‌రోడ్డు, మల్లికార్జున మహామండపంలో భక్తుల సౌకర్యార్థం షెడ్లు వేయించారు. అన్నదాన భవానాన్ని మల్లికార్జున మహామండపంలోకి మార్చడంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉంది.

ఒకే ఏడాది నలుగురుకార్యనిర్వహణాధికారులు
ఒకే ఏడాదిలో నలుగురు ఈఓలు మారడంతో  దేవస్థానం అభివృద్ధికి ఆటంకంగా మారింది. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగిన నేపథ్యంలో ఈవో ఎ.సూర్యకుమారిని జనవరి 7 బదిలీ చేశారు. అదే రోజు తాత్కాలిక ఈవోగా అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్‌ వైవీ అనూరాధ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 29న మొవ్వ పద్మను ఈవోగా నియమించారు. పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత చీర మాయం చేసిన ఘటనలో మొవ్వ పద్మను పదవి నుంచి తప్పించారు. ఆగస్టు 17న వి.కోటేశ్వరమ్మ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా ఈవోలను  మార్చడం చర్చనీయాంశంగా మారింది.

దుర్గమ్మను దర్శించుకున్నతెలంగాణ సీఎం కేసీఆర్‌.. 
జూన్‌ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దుర్గమ్మను దర్శించుకుని ముక్కెరను బహూకరించారు. తమిళనాడు డెప్యూటీ సీఎం పన్నీరుసెల్వం అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.
ఆలయ ప్రతిష్ట దెబ్బతీసిన పాలకమండలిదేవాలయం ప్రతిష్టను దేవస్థానం పాలకమండలి దెబ్బతీసింది. పాలకమండలి సభ్యులు తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా ప్రవర్తించారు. జూన్‌ రెండో వారంలో దేవస్థానంలో పాలకమండలి సభ్యుడు పెంచలయ్య కేశఖండనశాలలోని ఒక క్షురకుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో క్షురకులంతా రోడ్డెక్కారు. చివరకు ఈ వివాదం ముదిరి క్షురకులు తమకు వేతనాలు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. క్షురకులంతా వెళ్లి చంద్రబాబును కలసి ఆయన్ను నిలదీయడం.. నాయీబ్రాహ్మణులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 5న దుర్గగుడిలో భక్తులు సమర్పించిన ఖరీదైన చీరను పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత మాయం చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. చివరకు ఈ వివాదం ముదిరి కోడెల సూర్యలతను పాలకమండలి నుంచి తొలగించారు. ఈ ఘటనలతో దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింది.

చిన్నారి మిస్సింగ్‌.. మహిళల డ్రస్సింగ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు
అమ్మవారి దర్శనానికి వచ్చిన చిన్నారి నవ్య శ్రీ జూన్‌ 17న మల్లికార్జున  మహామండపం సమీపంలో మాయమైంది. సీసీ కెమెరాల సహాయంతో బాలిక ను ఒక మహిళ గుంటూరు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈలోగా ఆ మహిళ నవ్యశ్రీని పోలీసులకు అప్పగించడంతో కథ  సుఖాంతమైంది. జూన్‌ 25న దుర్గగుడికి చెందిన ఓ కాటేజీలో మహిళలు దుస్తులు మార్చుకునే ప్రదేశంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై భక్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో చివరకు కెమెరాలు తొలగించారు.

మరిన్ని వార్తలు