దుర్గగుడి ప్రతిష్ట పెంచడమే లక్ష్యం

17 Aug, 2018 13:43 IST|Sakshi
‘సాక్షి’తో దుర్గగుడి ఈఓ కోటేశ్వరమ్మ

కింది స్థాయి ఉద్యోగిపైనా దృష్టి పెడతా

పొరపాట్లు జరగకుండా       తగు జాగ్రత్తలు

భక్తుల సహకారంతో నిధులు కొరతను అధిగమిస్తాం

పాలకమండలి గురించి ప్రభుత్వం చూసుకుంటోంది

దుర్గగుడి ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న వి.కోటేశ్వరమ్మ  

దుర్గగుడి ప్రతిష్టను పెంచడమే లక్ష్యమని ఐఆర్‌ఎస్‌ అధికారి వీ కోటేశ్వరమ్మ అన్నారు. ఆలయ ఈఓగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. అవినీతిని అరికట్టేందుకు దృష్టి సారిస్తానన్నారు. తన పాలన పారదర్శకంగా ఉంటుందన్నారు. అన్ని విభాగాల సమాచారం వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

సాక్షి,విజయవాడ: రాష్ట్రంలోని రెండవ అతి పెద్ద దేవాలయం దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి  కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా వరుసగా మూడోసారి మహిళా అధికారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల కొందరి చేష్టలు ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తొలి మహిళా అధికారి సూర్యకుమారి తాత్రింక పూజలపై విమర్శలు రావడంతో బదిలీ కాగా, పాలకమండలి సభ్యురాలు చీర మాయం చేసిన ఘటనలో సంబంధం లేకపోయినా రెండో మహిళా అధికారి ఎం.పద్మపై బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలో మరో మహిళా అధికారి   వి.కోటేశరమ్మ ఈఓగా బాధ్యతలు చేపడుతున్నారు. దుర్గగుడి ప్రతిష్టను కాపాడేందుకు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఆమె తీసుకునే చర్యలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

సాక్షి: దుర్గగుడిలో అవినీతి వ్యవíస్థీ్థకృతమైపోయింది. దీన్ని ఏ విధంగా అరికడతారు?
కోటేశ్వరమ్మ: కింది స్థాయి ఉద్యోగిపైనా నేను ప్రత్యేకంగా దృష్టి పెడతాను. అవినీతి జరిగేందుకు అవకాశాలు ఉన్న విభాగాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటాను. పాలన పూర్తి పారదర్శకంగా  ఉంటుంది. అన్ని విభాగాల సమాచారం వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచుతాం.

సాక్షి:దుర్గగుడిలో కొంతమంది ఉద్యోగస్తులు దీర్ఘకాలంగా పాతుకుపోయారు. వారి వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా?
కోటేశ్వరమ్మ: పాలనా విధానంలో అందరిని కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తా. దేవాలయం ప్రతిష్ట పెంచడమే నా ప్రధాన ధ్యేయం. భక్తులకు మెరుగైన సేవలు అందించే విషయంలో రాజీ పడను. దీనికి అందరూ సహకరిస్తారని అనుకుంటున్నా. ఇబ్బంది కలిగించే వారిపై కఠినంగా ఉండటానికి వెనుకాడను.

సాక్షి:దేవస్థానంలో జరిగే పొరపాట్లకు ఈఓనే బాధ్యత వహించాల్సి వస్తోంది. మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు?
కోటేశ్వరమ్మ: ఎక్కడ పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాను. భక్తులకు మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తాను.

సాక్షి: ఒకవైపు అభివృద్ధిపనులు జరుగుతున్నాయి. మరోకవైపు నిధులు కొరత వెంటాడుతోంది? ఎలా అధిగమిస్తారు?
కోటేశ్వరమ్మ: దేవస్థానం అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం తప్పకుండా తీసుకుంటాను. అలాగే దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేందుకు ప్రయత్నిస్తాను.

సాక్షి: భక్తుల కష్టాలు ఏ విధంగా తెలుసుకుంటారు?
కోటేశ్వరమ్మ: గతంలో నవరాత్రులలో దుర్గగుడికి వచ్చాను. అప్పుడు భక్తులు పడే కష్టాలను ప్రత్యక్షంగా చూశా. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా చూస్తా.

సాక్షి: త్వరలో జరగబోయే దసరా ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలని అనుకుంటున్నారు?
కోటేశ్వరమ్మ: దసరా ఉత్సవాల నిర్వహణకు అందరి సహకారం అవసరం. గతంలో దేవాదాయశాఖలో పని చేసినందున ఆ అనుభవం కూడా ఉపయోగపడుతుందని భవిస్తున్నా. దసరా ఉత్సవాల్లో భక్తుల అవసరాలకే ప్రధాన ప్రాధాన్యం.

సాక్షి:పరిపాలనా వ్యవహారాల్లో పాలకమండలి జోక్యం ఎక్కువగా వుంటోందని తెలుస్తోంది.
కోటేశ్వరమ్మ: వారి గురించి ప్రభుత్వం చూసుకుంటుంది. ఇటీవలే పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పాలకమండలికి చెప్పినట్లు పత్రికల్లోనే చూశాను.

సాక్షి:  పాలకమండలి సభ్యుల  వల్ల దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోంది? దీన్ని ఏ విధంగా అడ్డుకుంటారు?
కోటేశ్వరమ్మ: ప్రతిఒక్కరూ దేవస్థానం ప్రతిష్ట పెంచేందుకే కృషి చేయాలి. పాలకమండలి ఏ విధంగా ఉండాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. 

మరిన్ని వార్తలు