దుర్గగుడి ఖాతాలో సర్కారు ఉగాది ఖర్చు!

15 Mar, 2015 03:15 IST|Sakshi
  • 25 లక్షలు ఇవ్వాలంటూ ఆదేశాలు
  •  ఆలయంలో ఉగాది ఉత్సవాలకు కోత
  •  తూతూ మంత్రంగా అమ్మవారి చైత్ర మాసోత్సవాలు?
  •  ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
  • సాక్షి, విజయవాడ:  ఉగాది వేడుకలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసిన తుళ్లూరులో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా రాజధానికి భూములిచ్చిన రైతులకు సత్కారాలు చేయడంతోపాటు వేదపండితులతో పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సీఎం చంద్రబాబుతోపాటు ఆయన మందీమార్బలమంతా తరలిరానుంది. దీనికయ్యే ఖర్చు రూ.25 లక్షలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఈ ఖర్చు భారమంతటినీ విజయవాడ కనక దుర్గమ్మపైన పెట్టారు. ఈ మేరకు తుళ్లూరులో అయిన ఖర్చులన్నింటినీ దేవస్థానం నుంచి విడుదల చేయాలని ఆలయ అధికారులకు ఆదేశాలందినట్లు సమాచారం.  
     
    దేవస్థానంలో ఉగాది ఉత్సవాలకు కోత..

    శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరం తొలిరోజు కావడంతో దేవస్థానానికి భక్తులు కూడా పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఉగాది పండుగరోజు నుంచే 18 రోజులపాటు దేవస్థానంలో అమ్మవారి చైత్ర మాసోత్సవాలు(వసంత నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు) నిర్వహిస్తారు.

    ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ ఏడాది ఉగాది వేడుకలకు, చైత్ర మాసోత్సవాలకు సుమారు రూ.6 లక్షలు ఖర్చవుతాయని దేవస్థానం అధికారులు అంచనాలు తయారు చేశారు. అయితే తుళ్లూరులో ప్రభుత్వం నిర్వహించే ఉగాది వేడుకల ఖర్చు భారం దేవస్థానంపై పడటంతో దుర్గగుడిలో జరిపే ఉగాది వేడుకలు, చైత్ర మాసోత్సవాల ఖర్చును తగ్గించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో అంచనాలు వేసిన రూ.6 లక్షల్లో సగానికి కోత పెట్టి రూ.3 లక్షలు ఖర్చు చేసే అవకాశాలు కనపడుతున్నాయి.
     
    అమ్మవారి సొమ్ముతో ప్రభుత్వం సోకులా?

    భక్తులు అమ్మవారిపై నమ్మకంతో కానుకలు, మొక్కుబడులు సమర్పిస్తారు. ఈ నిధుల్ని దేవస్థానం అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు మాత్రమే ఖర్చు చేయాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వం నిర్వహించే ఉగాది ఉత్సవాలకు దేవస్థానం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి చేసే ఉత్సవాల్లో కోతలు విధించి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు