ఇప్పటికైనా పోర్టు నిర్మాణం జరిగేనా

4 Aug, 2013 04:22 IST|Sakshi

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : బందరు పోర్టు నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా తెలంగాణను విడగొడుతూ ప్రకటన వెలువడటంతో సహజసిద్ధంగా ఉన్న వనరులను వినియోగించుకునే అంశంపై మన పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ముంచుకొచ్చింది. ఇంతకాలం హైదరాబాదులో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డారు. తెలంగాణ విభజనతో పరిస్థితులు మారాయి. ఇకనైనా సీమాంధ్రలోని వనరులను వినియోగించుకుని పారిశ్రామికాభివృద్ధి వైపు పయనించాల్సిన సమయం తరుముకొచ్చింది.

 బందరు పోర్టుతో అంతర్జాతీయ గుర్తింపు!

 బందరు పోర్టు నిర్మిస్తే మచిలీపట్నం అంతర్జాతీయ గుర్తింపునకు నోచుకుంటుంది. పారిశ్రామికాభివృద్ధికి అనేక అవకాశాలను తీసుకువస్తుంది. 16వ  శతాబ్దం నుంచే అప్పటి బ్రిటీష్, డచ్, ఫ్రెంచ్ వ్యాపారులు బందరు పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేసేవారని చరిత్ర చెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లోనే ఏడాదికి లక్షలాది టన్నుల సరకులు  బందరు పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. బ్రిటీష్ పాలకుల హయాంలో ప్రముఖ వాణిజ్యకేంద్రంగా వెలుగొందిన బందరు పోర్టు మన పాలకుల నిర్వాకంతో ఉనికి కోల్పోయింది. బందరు పోర్టు నిర్మించాలనే డిమాండ్‌తో గత పదేళ్లుగా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంత నాయకులు రాజకీయాలను పక్కనపెట్టి చిత్తశుద్ధితో కృషిచేయాల్సిన అవసరం ఉంది.

 భూసేకరణే కీలకం..

 2003 నుంచి బందరు పోర్టు నిర్మించాలని కోరుతూ ఉద్యమం జరుగుతూనే ఉంది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ పోర్టు అభివృద్ధికి టెండర్లు పిలిచినట్లే పిలిచి వాటిని రద్దు చేసింది. 2007 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 2008 ఏప్రిల్‌లో పోర్టు నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేశారు.

 వైఎస్ మరణంతో పోర్టు అభివృద్ధిని పట్టించుకునే కరువయ్యారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరిగిన 18 నెలల్లోనే నిర్మాణం పూర్తిచేస్తామని పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ చెబుతూ వచ్చింది. కృష్ణపట్నం పోర్టును 18 నెలల్లోనే నిర్మించినట్లు ఉదాహరణగా కూడా చూపింది. అయినా పాలకులు కోస్తా తీరం అభివృద్ధికి దోహదపడే బందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయకుండా జాప్యం చేస్తూనే వచ్చారు.

 నెరవేరని ముఖ్యమంత్రి హామీ..

 గత ఏడాది మే రెండో తేదీన పోర్టు నిర్మాణానికి 5,324 ఎకరాల భూమిని కేటాయిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో నంబరు 11ను విడుదల చేశారు. మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు. నెల రోజుల్లోనే తొలివిడతగా 1,600 ఎకరాలు సేకరిస్తామని ఓడరేవుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నతస్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓడరేవుల శాఖకు చెందిన అధికారులు, జిల్లా కలెక్టర్ ఈ భూములను గుర్తించి, సేకరించాలని నిర్ణయించారు. అవన్నీ ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా రాజకీయాలకతీతంగా పోర్టు నిర్మాణానికి నాయకులంతా దృష్టిపెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు