నేటి నుంచి దసరా ఉత్సవాలు

10 Oct, 2018 03:23 IST|Sakshi

దసరా ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి దశమి వరకు తొమ్మిది రోజుల పాటు కనకదుర్గమ్మ అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు అమ్మవారిని స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. ఉదయం 9నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు.

సాక్షి, అమరావతి బ్యూరో:  అంగరంగవైభవంగా జరిగే  దసరా శరన్నవరాత్రిమహోత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు అమ్మవారిని స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. ఉదయం 9నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్నారు. 

ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో నిత్యం లక్ష కుంకుమార్చన, చండీయాగాలు నిర్వహిస్తారు. ఇంద్రకీలాద్రిని రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ప్రధాన రహదారుల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 వరకు అన్నప్రసాదాన్ని పంపిణీచేస్తారు. 

అధికారుల నిరంతర పర్యవేక్షణ
ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు 5,500 మంది పోలీసులను రప్పించారు. అంతేకాకుండా ఇతర దేవాలయాల నుంచి 300 మంది దేవాదాయ సిబ్బందిని, 2000 మంది ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లను నియమించారు. భక్తుల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నెం: 18004259099 ను ఏర్పాటుచేశారు.  జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, దుర్గగుడి ఈఓ, నగర పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తుంటారు. 

తెల్లవారుజాము నుంచే దర్శనాలు
తొలిరోజు స్నపానాభిషేకం అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. రెండో రోజు నుంచి తెల్లవారు జాము 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. 14న మూలానక్షత్రం రోజున రాత్రి ఒంటి గంట నుంచి మరలా రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.  దసరా ఉత్సవాల్లో  అమ్మవారి నగరోత్సవం కనులపండువగా జరుగుతుంది. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు శివాలయం మెట్ల నుంచి నగరోత్సవం ప్రారంభమై అర్జున వీధి, రథం సెంటర్, వినాయకగుడి మీదుగా రథం సెంటర్‌ టోల్‌ గేటు ద్వారా ఇంద్రకీలాద్రి పైకి చేరుకుంటుంది. నగరోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా బ్రహ్మరథం, బేతాళనృత్యం, తాళభజనలు, సంకీర్తనలు, కోలాట బృందాలు, నృత్య బృందాలు, వేద విద్యార్థులు, కేరళ వాయిద్యం, నయాండ వాయిద్యం, సన్నాయి వాయిద్యం, ఘటాటోపం, వేదపండితులతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

పదుల నుంచి వేలకు పెరిగిన భక్తులు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో రెండో స్థానంలో ఉన్న బెజవాడ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి ప్రతి నిత్యం 25 వేల మందికి పైగా భక్తులు విచ్చేస్తుంటారు.. 1900 సంవత్సరం నాటికి చిన్న ఆలయంగా ఉన్న దుర్గగుడికి ప్రతి రోజు  50 నుంచి వంద మంది భక్తులు మాత్రమే వచ్చే వారు.  ఉదయం అమ్మవారి ఆలయం తెరిచి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భక్తులు దర్శనానికి విచ్చేసేవారు. మధ్యాహ్నం నివేదన సమర్పించిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేసే వారు. ఇక సాయంత్రం ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించే వారు. సాయంత్రం చీకటి పడే వేళకు అర్చకులు  కాగడా పట్టుకుని కొండ దిగేవారట. అలాంటి  దుర్గగుడి దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది.  1990 నుంచి ఆలయం మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1999లో దుర్గమ్మ ఆలయానికి బంగారు తాపడం పనులు చేపట్టారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి 1999 ఏప్రిల్‌ 19న ఆలయానికి విచ్చేసి  స్వయంగా ఈ పనులను పరిశీలించారు.  అప్పటి ఈవో ఈ. గోపాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో బంగారు తాపడం పనులు జరిగాయి. 

మరిన్ని వార్తలు