న్యాయం కోసం డ్వాక్రా మహిళల అభ్యర్థన

22 Jun, 2018 10:24 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న డ్వాక్రా మహిళలు మొల్లేటి లక్ష్మి, వేండ్ర ముత్యవతి

మెప్మా ఉద్యోగి అసభ్యంగా మాట్లాడారని ఆవేదన

పోలీసులకు ఫిర్యాదు

భీమవరం(ప్రకాశం చౌక్‌): తమ డ్వాక్రా గ్రూపులోని సభ్యులే రూ.40 వేల సొమ్ము స్వాహా చేశారని మున్సిపాలిటీ కమిషనర్‌కు తెలియజేయడానికి వెళ్తే ఆయనను కలవనీయకుండా డ్వామా సీఎంఎం ఎం.ఫణికుమార్‌ అడ్డుకుని అసభ్యకరంగా మాట్లాడారని డ్వాక్రా గ్రూపు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు భీమవరం 7వ వార్డుకు చెందిన మదర్‌ థెరిస్సా డ్వాక్రా గ్రూపు సభ్యులు వేండ్ర ముత్యవతి, మొల్లేటి లక్ష్మీ గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. మా మదర్‌ థెరిస్సా గ్రూపులో 10 మంది గ్రూపు సభ్యులుగా ఉన్నాం. ఆంధ్రాబ్యాంకులో రుణం రూ.5 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించి ఈ ఏడాది రూ.7 లక్షలు కావాలని మేనేజర్‌ను అడిగాం. దీంతో ఆయన మీ అప్పు ఇంకా రూ.1.2 లక్షలు ఉందని చెప్పారు. మా పుస్తకాలు చూస్తే దానిలో రూ.40 వేలు వరకు కట్టకుండా మా గ్రూపు కార్యదర్శి సాయిలక్ష్మి, మరో సభ్యురాలు వాడేసుకున్నట్టు తేలింది. వారిని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు.

ఇది ఇలా ఉండగా మా గ్రూపునకు రూ.7 లక్షల రుణం ఇప్పించాలంటే రూ.10 వేలు ఇవ్వాలని సీఆర్పీ సుభాషిణి అడిగారు. దీంతో మా సమస్య పరిష్కారం కోసం మునిసిపాలిటీ కమిషనర్‌ వద్దకు వెళ్తే మెప్మా సీఎంఎం ఫణికుమార్‌ అడ్డు తగిలారు. తన ఆఫీసుకు పిలిచి ‘నేను సీఎం చంద్రబాబు బంధువును.. మీరు ఎక్కడకి వెళ్లినా నా దగ్గరకు రావాల్సిందేనని వ్యంగ్యంగా, అసభ్యంగా మాట్లాడారు. మాకు న్యాయం చేయకుండా నెల రోజుల పాటు తన ఆఫీసు చుట్టూ తిప్పించుకున్నారు. అలాగే 5వ వార్డు కౌన్సిలర్‌ అల్లూరి నాగవల్లి కూడా మమ్మల్ని బెదిరించారు’ అని బాధిత గ్రూపు మహిళలు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు విలేకరుల సమక్షంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మెప్మా సీఎంఎం ఎం.ఫణికుమార్‌ను వివరణ కోరగా సదరు డ్వాక్రా గ్రూపు సభ్యులతో తాను అసభ్యకరంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు