బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమల రావు

19 Jul, 2018 13:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగర పోలీస్‌ కమీషర్‌గా ద్వారకా తిరుమల రావు గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీలో ఎటువంటి సవాళ్లనైనా స్వీకరిస్తామని చెప్పారు. నగరంలో ప్రాధాన్య అంశాలపై దృష్టి పెడతామని, ఆర్థిక నేరాలు, సైబర్‌ క్రైమ్‌పై దృష్టి సారించినున్నట్లు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తామని, జనరల్‌ క్రైమ్‌ను కూడా అరికట్టడానికి కృషి చేస్తానని చెప్పారు. రాజధాని నగరంలో వీఐపీల తాకిడి పెరుగుతోందని, తద్వారా ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. మహిళలు, పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. మహిళా మిత్రలను మరింత మలోపేతం చేస్తామని, నగర ప్రజల్లో భద్రతా భావం పెంచుతామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన ప్రజలనుంచి సలహాలు తీసుకుంటామని అన్నారు.

బాధ్యతలను స్వీకరించడానికి ముందు కమీషనర్‌ ద్వారకా తిరుమల రావు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. బాధ్యతలు చేపట్టే ముందు అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చానని అన్నారు. నగరంలో ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పని చేసే శక్తి ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు