సెంటిమెంట్‌ స్వామి

6 Jul, 2018 13:10 IST|Sakshi

కొంగు బంగారంగా చినవెంకన్న 

తరచూ ప్రముఖుల సందర్శన  

దినదినాభివృద్ధి చెందుతున్న క్షేత్రం

సాక్షి, ద్వారకాతిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించడం భక్తులకు సెంటిమెంట్‌గా మారింది. చిన్నతిరుపతిగా పేరొంది, పురాణ ప్రాశస్త్యం గల ఈ మహిమాన్విత క్షేత్రం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకంటే శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతోపాటు, ప్రముఖులు క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. చినవెంకన్నను ఏదైనా కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుందన్నది భక్తుల నమ్మకం. స్వామికి ప్రీతికరమైన శనివారం రోజు దాదాపు 25 వేల నుంచి 40 వేల మంది వరకు భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

ఆదివారం, ఇతర పర్వదినాల్లో సైతం భక్తుల రాక ఇదే విధంగా ఉంటోంది. క్షేత్ర పరిసరాలు ఆహ్లాదభరిత వాతావరణాన్ని కలిగి ఉండటంతో భక్తులు అధిక సమయం ఇక్కడే గడుపుతున్నారు. ఆలయ అభివృద్ధి ఏవిధంగా పరవళ్లు తొక్కుతుందో.. అదే విధంగా ఆదాయం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీవారి వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేరింది. పలువురు దాతలు ఆలయ అభివృద్ధికి విరివిగా విరాళాలు అందిస్తున్నారు. 

ఎంతటి వారైనా.. చెంతకు రావాల్సిందే
తరచూ క్షేత్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు, న్యా యమూర్తులు, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, అలాగే విదేశీయులు, సినీ గాయకులు, పీఠాధిపతులు, స్వామీజీలు సందర్శిస్తున్నారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టే అధికారులు ముందుగా శ్రీవారిని దర్శించడం పరిపాటిగా మారింది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఘన విజయం సాధించాలని దర్శక, నిర్మాతలు, హీరో, హీరోయిన్‌లు, ఇతర నటులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. ఇది వారికి ఒక సెంటిమెంట్‌గా మారింది. ఆ వెంకన్న దయవల్లే తన సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్నాయని ఇక్కడకు వచ్చిన ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు చెప్పారు.

సంప్రదాయం ఏదైనా..
వేలాది మంది భక్తులు వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా క్షేత్ర పరిసరాల్లో వివాహాలు జరుపుకుంటున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న వారు సైతం ముందుగా ఆ చినవెంకన్న దర్శనానికి వచ్చి మొక్కుబడులను చెల్లిం చుకుంటున్నారు. సంప్రదాయం మాటెలా ఉన్నా తమ ఇష్టదైవం చినవెంకన్నను దర్శించడమే ముఖ్యమంటున్నారు భక్తులు. 

ఆలయంలో పూజలు చేస్తున్న హీరో వరుణ్‌తేజ్, నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు శేఖర్‌ కమ్ముల

మరిన్ని వార్తలు