మైక్రో ఉచ్చులో విలవిల

31 Aug, 2015 00:00 IST|Sakshi
మైక్రో ఉచ్చులో విలవిల

డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకర్లు
ఇవ్వాల్సిన రుణం రూ.1139కోట్లు
ఐదు నెలల్లో ఇచ్చింది రూ.175కోట్లు
పాత బకాయిల పేరుతో ముఖం చాటేస్తున్న వైనం

 
రుణమాఫీ పాపం డ్వాక్రా సంఘాలకు శాపమై వెంటాడుతోంది. రుణాలు దొరక్క నిరుపేద మహిళలు మైక్రో ఉచ్చులో పడివిలవిల్లాడుతున్నారు. మాఫీకి మంగళం పాడేసి..ఆర్థిక వెసులుబాటు పేరిట సంఘానికి రూ.30వేల చొప్పున జమ చేసినా బ్యాంకర్లు మాత్రం ముఖం చాటేస్తున్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలంటూ సంఘాల పాలిట సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు.
 
విశాఖపట్నం: ఏరు దాటే వరకు ఓడ మల్లన్న..దాటాక బోడి మల్లన్న చందంగా గద్దెనెక్కే వరకు మాఫీ జపం పాటించిన టీడీపీ పాలకులు పగ్గాలు చేపట్టిన తర్వాత రుణమాఫీని మాఫీ చేశారు. ఏడాది పాటు ఊరించి ఊరించి చివరకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున సంఘానికి రూ.30వేలుగా జమ చేశారు. ఈ మొత్తంతో పదిరెట్లు రుణం ఇప్పిస్తాం..దాంతో సంఘాలన్నీ బలోపేతమైపోతాయని ఊహలపల్లకిలో ఊరేగించారు. తీరా ఆచరణలో మాత్రం బ్యాంకర్లు వీరికి చుక్కలు చూపిస్తున్నారు. మార్చిలో  ప్రకటించిన రుణప్రణాళిక ప్రకారం ఈ ఏడాది జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు రూ.1139 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఈ రుణాలను 24,392 మందికి ఇవ్వను న్నట్టుగా ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై అప్పుడే ఐదు నెలలు గడిచిపోయింది. కేవలం రూ.175కోట్లు మాత్రమే రుణాలివ్వగలిగారు. అది కూడా పాతబకాయిలు చెల్లించినవారికే. ఈ విధంగా రుణాలు పొందిన వారు జిల్లాలో నాలుగువేలకు మించి లేరని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఆర్థికసంవత్సరం ముగియడానికి మిగిలింది ఏడు నెలలే. ఇవ్వాల్సిన రుణ లక్ష్యం సుమారు వెయ్యికోట్ల వరకు ఉంది. ఆర్థిక వెసులుబాటుతో సర్కార్ సమకూర్చిన పెట్టుబడి నిధిపై చిత్తశుద్ధి ఉంటే రుణాలు ఇవ్వొచ్చు. కానీ బ్యాంకర్లు మాత్రం రుణమాఫీ వర్తించని రైతుల మాదిరిగానే వడ్డీతో కొండలా బకాయిలున్న సంఘాల వైపు కన్నెత్తయినా చూడడంలేదు. దీంతో ఎక్కే గుమ్మం..దిగే గుమ్మం అన్నట్టుగా డ్వాక్రా సంఘాల మహిళలు రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా అధికారులు చెప్పేది ఒకటైతే..క్షేత్రస్థాయిలో జరిగేది మరొకటిగా ఉంది. దీంతో రుణాలు వీరికి అందని ద్రాక్షగా మారుతున్నాయి. గతేడాది రుణమాఫీ పుణ్యమాని రూ.755 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా అతికష్టంమీద రూ.200కోట్లకు మించి ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా అదే సీను రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉచ్చు బిగిస్తున్న మైక్రో సంఘాలు
ఇన్నాళ్లు బ్యాంకర్లు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. దీంతో మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు కాళ్లావేళ్లాపడినా వీరి వడ్డీబాదుడుకు జడిసి  ఎవరూ వీరి వద్ద రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం వ్యాపార, కుటుంబ అవసరాలు నిమిత్తం మళ్లీ మైక్రో సంఘాల దారి పట్టాల్సి వస్తోంది. ఐదురూపాయలు..పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా తమ అవసరాల కోసం వీర్ని ఆశ్రయించకతప్పని దుస్థితి.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు