కరోనా నియంత్రణకు మేము సైతం

16 Jul, 2020 11:15 IST|Sakshi
ఆన్‌లైన్‌లో శిక్షణ పొందుతున్న సంఘ సభ్యులు

వైరస్‌ నివారణకు డ్వాక్రా మహిళలకు ఆన్‌లైన్‌ శిక్షణ

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

జిల్లాలో 1.19 లక్షల మందికి అవగాహన  

తణుకు : మహిళలు ఆకాశంలో సగభాగం అన్నారు పెద్దలు.. ఇప్పుడు కరోనా మహమ్మారి నియంత్రణకు సగం బాధ్యతను మహిళలు తీసుకుంటున్నారు.. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడి నిజం చేస్తూ ముందు ఇంట్లో మహిళలు అవగాహన పెంచుకుని తద్వారా కుటుంబ సభ్యులను హెచ్చరించేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మహమ్మారిని జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇస్తున్న ఆన్‌లైన్‌ శిక్షణ సత్ఫలితాలు ఇస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో సెల్‌ఫోన్లలో డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 12,208 స్వయం సహాయక సంఘాల్లో 1.19 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 58,650 మంది ఈ ఆన్‌లైన్‌ శిక్షణ పూర్తి చేసుకున్నారు.

నిపుణులతో శిక్షణ
జిల్లాలో ఈనెల 1 నుంచి మెప్మా మిషన్‌ డైరక్టరేట్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ శిక్షణ ప్రారంభించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణ లక్ష్యంతో ‘కోవిడ్‌–19 నివారణ – నియంత్రణలో సంఘ సభ్యులు’ అనే కార్యక్రమం రూపొందించారు. దీనిలో భాగంగా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్వాక్రా మహిళలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో అధికారులు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఆన్‌లైన్‌ శిక్షణ కొనసాగించనున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు వారి ఇంటి నుంచే వారి కుటుంబ సభ్యులు సైతం ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ప్రతి రోజు నాలుగు దశల్లో సుమారు అయిదు వేల మందికి ఆన్‌లైన్‌ శిక్షణ అందజేస్తున్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా కోవిడ్‌ –19 సమయంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన జాగ్రత్తలు, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, ఆరోగ్యకర అలవాట్లు, యోగా, ధ్యానం వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 30 మంది నిపుణుల బృందంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

మహిళకు అవగాహన కల్పించడం ద్వారా..
కరోనా మహమ్మారిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వినూత్న కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. ఒక కుటుంబంలో ముందుగా మహిళకు అవగాహన కల్పిస్తే తద్వారా కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉంటారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం రూపకల్పన చేసింది. జిల్లాలో డ్వాక్రా మహిళలకు ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.–టి.ప్రవీణ, మెప్మా పీడీ, ఏలూరు

రోగనిరోధక శక్తి ప్రధానం  
కోవిడ్‌–19 సమయంలో పాటించాల్సిన నియమాలపై జిల్లాలోని మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు ప్రధానంగా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం ద్వారా కరోనా నివారణ సాధ్యమవుతుంది. ఆహార నియమాలు పాటించి పౌష్టికాహారం తీసుకుంటూ మానసిక ప్రశాంతత కోసం శ్వాస ప్రక్రియలు, యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నాం.–కె.మహాలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్, హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌

మరిన్ని వార్తలు