బ్యాంకర్‌ తీరుపై మహిళల ఆగ్రహం

16 Jun, 2019 11:35 IST|Sakshi
బ్యాంకు ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న డ్వాక్రా మహిళలు

పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు): బ్యాంకర్ల తీరును నిరసిస్తూ మండుటెండలో డ్వాక్రా మహిళలు  ఆందోళనకు దిగిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉంది. ఈ బ్యాంకు పరిధిలోని ఆరు గ్రామైక్య సంఘాల్లో 191 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఆయా గ్రూపుల సభ్యులు గడిచిన ఐదేళ్లుగా నెలనెలా క్రమం తప్పకుండా పొదుపులు జమ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గ్రూపుల సభ్యులు రుణం పొందేందుకు బ్యాంకు మేనేజర్‌ వద్దకు పలు మార్లు వెళ్లారు. ఆయన రుణాలు ఇవ్వకుండా రకరకాల కొర్రీలు పెడుతూ మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నాడు. దీంతో మహిళలు విషయాన్ని వెలుగు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. వారు బ్యాంకుకు వెళ్లి మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది.

షట్టర్లు మూసివేసి నిరసన
ఈ నేపథ్యంలో శనివారం డ్వాక్రా మహిళలు, వీవోఏలు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. బ్యాంకు ప్రధాన ద్వారాలు మూసివేసి బ్యాంకు ఎదుట బైఠాయించారు. రుణాలివ్వాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గడిచిన ఐదేళ్లుగా రుణాలు సక్రమంగా ఇవ్వకుండా నానా రకాలుగా వేధిస్తున్నారని మహిళలు ఆరోపించారు. తాము పొదుపు చేసుకున్న డబ్బులు తీసుకున్నా కూడా వాటిని అప్పుగా చూపించి, మా నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నారని వాపోయారు. రుణం పొందేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

షూరీటీ ఇస్తేనే రుణాలు....
డ్వాక్రా మహిళలమైన తమకు మూడు లక్షల రూపాయలకు పైగా రుణం ఇవ్వాలంటే షూరిటీలు అడుగుతూ ఇబ్బందులు పెడుతున్నారని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. మూడు లక్షలకు పైగా కావాలంటే పొలం పట్టాదారు పాస్‌పుస్తకాలు కావాలని వేధిస్తున్నారని, అవి ఎక్కడి నుంచి తీసుకుని రావాలంటూ ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు దాదాపుగా నాలుగు గంటలపాటు మహిళలు బ్యాంకు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్‌ మాట్లాడుతూ మూడు లక్షలకు పైగా ఎలాంటి షూరిటీలు లేకుండా డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తే ఆడిట్‌ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు.  పొదుపు డబ్బులకు వడ్డీలు వసూలు చేస్తుండటంపై ఆయన సరైన సమాధానం చెప్పలేదు. దీంతో మహిళలు బ్యాంకు మేనేజర్‌ తీరుపై మరింత ఆగ్రహానికి గురయ్యారు. సీసీలు, గ్రామస్తులు, డ్వాక్రా లీడర్లు మేనేజర్‌తో చర్చలు జరిపిన అనంతరం సోమవారం నుంచి రోజుకు మూడు గ్రూపుల చొప్పున మహిళలకు లింకేజీ రుణాలిస్తామని మేనేజర్‌ రమేష్‌ హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. 

మరిన్ని వార్తలు