వాగ్దాన భంగం దెబ్బకు డ్వాక్రా ఢమాల్!

4 Dec, 2014 01:11 IST|Sakshi
వాగ్దాన భంగం దెబ్బకు డ్వాక్రా ఢమాల్!

* చంద్రబాబు హామీలతో కుదేలైన పొదుపు సంఘాలు
* సగానికి సగం పడిపోయిన సభ్యుల పొదుపు.. బ్యాంకు లోన్లూ లేవు
* సంఘాల సమావేశాలకే దూరమైన మహిళలు
* తొలుత రుణ మాఫీ హామీ, తర్వాత కార్పస్ ఫండ్ అంటూ మాట మార్పు
* తాజాగా ఒక్కో సభ్యురాలికి రూ.10 వేలు ఇచ్చే యోచన.. ఇప్పటికి రూపాయి కూడా అందని సాయం
* పొదుపు ఖాతాల్లోని సొమ్ముతో పాటు దాదాపు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ కూడా జమ
* లబోదిబోమంటున్న మహిళలు.. ఇసుక రీచ్‌ల పేరిటా సర్కారు దగా  

 
 సాక్షి, హైదరాబాద్: అమలుకు నోచని చంద్రబాబునాయుడు హామీలతో అన్నదాతలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలూ దారుణంగా మోసపోయారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన సుమారు రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ హామీపై.. అధికారంలోకి రాగానే చంద్రబాబు మాట మార్చారు. కార్పస్ ఫండ్ ఇస్తామన్నారు. ఇప్పుడు మంత్రులు సభ్యురాలికి రూ.10 వేల చొప్పున సాయం అంటున్నారు. ఇప్పటికి మహిళలకు రూపాయి కూడా అందలేదు. రాష్ట్రంలో పదిహేనేళ్ల పాటు ఇటుక ఇటుక పేర్చి నిర్మించుకున్న డ్వాక్రా వ్యవస్థ కేవలం ఆరు నెలల్లోనే కకావికలమైపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 6,64,723 సంఘాల్లో సుమారు 6.5 లక్షల సంఘాల పనితీరు గణనీయంగా మందగించింది. కేవలం 708 సంఘాలే ‘ఏ’ గ్రేడ్‌లో ఉండటం గమనార్హం. మహిళల్లో విప్లవం మాదిరి వెల్లివిరిసిన పొదుపు చైతన్యం ఒక్కసారిగా చతికిలపడిపోయింది.
 
 సభ్యుల పొదుపు సగానికి సగం పడిపోయింది. వారానికో, నెలకొకసారో తప్పనిసరిగా సంఘాల వారీగా సమావే శమయ్యే సభ్యులు అటువైపే వెళ్లడం లేదు. దీంతో మహిళల పొదుపు విషయంలోనూ, వారికి రుణాలు అందడంలోనూ ఒకనాడు దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో.. ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకే బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6,64,723 వరకు పొదుపు సంఘాలుండగా, ఆరు నెలల కిందటి వరకు అందులో 5 లక్షల వరకు సంఘా లు బాగా పనిచేసే ఏ గ్రేడ్ (సంఘాల పనితీరు ఆధారంగా ప్రభుత్వమే సంఘాలకు గ్రేడ్‌లు ఇస్తుంది)లో ఉండేవి. కానీ నవంబర్ నెల గణాంకాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
ప్రస్తుత పొదుపు సంఘాల దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. 6,64,723 సంఘాల్లో కేవలం 708 సంఘాలు మాత్రమే ‘ఏ’  గ్రేడ్ కిందకు వచ్చాయి. రెండో కేటగిరీలో మరో 29,850 సంఘాలు ఉంటే.. మిగిలిన దాదాపు 6.3 లక్షల సంఘాలు సీ, డీ కేటగిరీలో ఉన్నాయి. క్రమం తప్పకుండా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడం, సభ్యుల హాజరు, పొదుపు తీరు, సంఘాలు అంతర్గతంగా, బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలను సకాలం చెల్లించడం వంటి 11 అంశాల ఆధారంగా సెర్ప్ అధికారులు సంఘాలకు గ్రేడ్లను ఇస్తుంటారు. మహిళలు తాము తీసుకున్న రుణాలను బాబు హామీలను నమ్మి తిరిగి బ్యాంకులకు చెల్లించకపోవడంతో.. అవి డ్వాక్రా గ్రూపులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఇచ్చిన రుణాల బకాయిలు చెల్లించాలని  ఒత్తిడిచేస్తున్నాయి. పొదుపు ఖాతాల్లోని నిధులతో పాటు, కార్పస్ ఫండ్‌ను బకాయిలకు జమ చేసుకుంటున్నాయి.
 
 కార్పస్ ఫండ్‌కూ ఎసరు
 ఆగస్టు రెండో పక్షంలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  నివేదిక సమర్పిస్తూ.. అప్పటివరకు రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల పేరిట రూ.4,025 కోట్ల కార్పస్ ఫండ్ (సంచిత నిధి) ఉందని పేర్కొన్నారు. (సభ్యులు చేసుకున్న పొదుపు మొత్తం, దానిపై వచ్చిన వడ్డీ, సంఘాలకు ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఇచ్చే మొత్తం కలిపి కార్పస్ ఫండ్‌గా పిలుస్తారు) మంత్రి అసెంబ్లీకి నివేదిక సమర్పించిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో డ్వాక్రా మహిళలు ప్రతి నెలా రూ.30 కోట్ల వరకు పొదుపు చేసుకున్నారు. ఆ మేరకు రూ.4,100 కోట్లకు పైగా పెరగాల్సిన కార్పస్ ఫండ్ విచిత్రంగా తరిగిపోయిం ది. నవంబర్ 15వ తేదీ నాటికి రూ.4,022 కోట్ల కార్పస్ ఫండ్ మాత్రమే ఉందని సెర్ప్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు వంద కోట్ల కార్పస్ ఫండ్‌ను బ్యాంకులు బకాయిలు కింద జమ చేసుకున్నట్టు అర్థమవుతుంది.
 
 ఇసుక వ్యాపారం మహిళలది.. లాభం ప్రభుత్వానిది!
 డ్వాక్రా రుణాలు మాఫీ చేయని ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక అమ్మకాలను ఆ సంఘాలకు అప్పగించినట్టు  చెప్పుకుంటోంది. వారి ఆధ్వర్యంలోనే అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ  మహిళలకు చిల్లర మాత్రమే దక్కుతోంది. రాష్ట్రంలో రూ.42 కోట్ల విలువైన ఆరున్నర లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరగగా,  వ్యాపారం చేసిన డ్వాక్రా సంఘాలకు దక్కుతున్నది రూ.20 లక్షలు మాత్రమే. రూ.42 కోట్ల లో ఖర్చులు పోను ప్రభుత్వానికి  సుమారు రూ.30 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి క్యూబిక్ మీటరు ఇసుక అమ్మకంపై మహిళలకు మూడు రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.
 
 చంద్రబాబు కప్పదాట్లు ఇలా..
2014 మార్చి 30: టీడీపీ అధినేతగా చంద్రబాబు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. ‘ఆర్థిక చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం’ అంటూ హామీ ఇచ్చారు.
 
2014 జూన్ 8: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకా రం చేసిన సందర్భంగా రైతు, చేనేత రుణాలతో పాటు డ్వాక్రా రుణాలు మాఫీకి ఉద్దేశించిన ఫైలుపై తొలి సంతకం.
 
 2014 జూలై 21: రాష్ట్ర రెండవ మంత్రివర్గ సమావేశ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. డ్వాక్రా గ్రూపు రుణాలు మాఫీకి బదులు ప్రతి గ్రూపునకు లక్ష రూపాయల చొప్పన ఆయా సంఘాల కార్పస్ ఫండ్‌కు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. (ఇప్పుడు మంత్రు లు చెబుతున్న దాన్నిబట్టి ప్రతి డ్వాక్రా గ్రూపునకు లక్ష రూపాయల సాయానికి బదులు, సంఘం లో ప్రతి సభ్యునికి పది వేలు సాయంగా అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే సంఘం లో పది మంది సభ్యులుంటే లక్ష, 8 మందే సభ్యులుంటే రూ.80 వేలే చెల్లిస్తారన్నమాట)
 
తాజా పరిస్థితి: చంద్రబాబు అధికారం చేపట్టి రేపోమాపో ఆరు నెలలు పూర్తి కావస్తోంది. ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా చెప్పినా.. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు రూపాయి సాయం కూడా అందలేదు.
 
 బ్యాంకుల్లో మర్యాద పోయింది..
 మీ బాధలు గమనిస్తున్నా. కష్టాల్లో తోడుంటామన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటల గారడీ చేశారు. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ఇంతకుముందు బ్యాంకుకు వెళితే మర్యాదగా చూసేవారు. హామీ నమ్మి బ్యాంకుల్లో విశ్వాసం కోల్పోయాం.
 - జయశీల, గృహిణి, విజయవాడ

మరిన్ని వార్తలు