చంద్రబాబుపై మన్యం మహిళల కన్నెర్ర

5 Aug, 2014 13:20 IST|Sakshi
చంద్రబాబుపై మన్యం మహిళల కన్నెర్ర

అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తాం.... టీడీపీకే ఓట్లు వేయమని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడుపై మన్యం మహిళలు కన్నెర్ర చేశారు. రుణమాఫీపై మాట తప్పిన బాబు సర్కార్పై డ్వాక్రా మహిళలు మండిపడ్డారు.  తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని ఏడు మండలాల పరిధిలోని గ్రామల నుంచి డ్వాక్రా మహిళలు నిన్న రంపచోడవరం తరలి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథకం కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీపై చంద్రబాబు చెబుతున్న కుంటిసాకులపై వారు నిప్పులు చెరిగారు. డ్వాక్రా మహిళలకు ట్వాక్రా వేశారంటూ ధ్వజమెత్తారు.

డ్వాక్రా సంఘాలకు చెందిన సుమారు 50వేలమంది రుణమాఫీ కోసం పడిగాపులు పడుతున్నారు. అయితే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీతో 30 కోట్ల మేర రుణం మాఫీ అవుతుందని మహిళలు ఆశపడ్డారు. ఓట్లు వేయించుకున్న బాబు... సీఎం అయినా ఆ హామీ అమలు చేయకపోవటంతో నిరాశ చెందారు. అధికారంలోకి వచ్చాక బాబు రుణాలు రద్దుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినందునే మహిళలు, రైతులు ఓట్లు వేశారన్నారు. బేషరతుగా రుణాలు మాఫీ చేయాలని లేకుంటే ఈ నెల 18న ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత మాట మారుస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై డ్వాక్రా మహిళలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు ట్వాక్రా వేసిన చంద్రబాబు అసలు ఆదాయ వ్యయాలపై శే్వతపత్రం విడుదలచేస్తే గుట్టు రట్టు కాగలదని అన్నారు.

 

>
మరిన్ని వార్తలు