మా డబ్బులు ఎక్కడ?

5 Feb, 2019 08:26 IST|Sakshi
బ్యాంకు ఎదుట బైఠాయించిన మహిళలు

డ్వాక్రా మహిళల ఆందోళన

ఆవులమంద ఏపీజీబీ బ్యాంకు పరిధిలో రూ.50 లక్షలు గల్లంతు

ప్రకాశం, కురిచేడు: ఆవులమంద బ్యాంకులో తాము తీసుకున్న రుణాల కిస్తీలు, పొదుపు డబ్బుల కిస్తీలు జమ కాలేదని మండలంలోని పడమరనాయుడుపాలెం, వీవై కాలనీకి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు సోమవారం ఆందోళనకు దిగారు. సుమారు 45 గ్రూపులకు చెందిన 400 మంది సభ్యులు బ్యాంకు ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకూ బ్యాంకు నుంచి కదిలేది లేదని హెచ్చరించారు. వివరాలు.. బ్యాంకు పరిధిలోని పడమర నాయుడుపాలెం గ్రామానికి చెందిన పల్లె రవీంద్ర ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బుజినెస్‌ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాడు. రవీంద్ర గత నెల 30వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 31వ తేదీ ఐనవోలు మేజర్‌లో శవమై తేలాడు. రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మృతి చెందాడా? లేక ఎవరైనా చంపేసి కాలువలో పేడాశారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రవీంద్ర బ్యాంకులో బిజినెస్‌ కరస్పాండెంటుగా పనిచేస్తుండటంతో నాయుడుపాలెం, వల్లేల యానాదికాలనీకి చెందిన మహిళలు డ్వాక్రా రుణాలతో పాటు పొదుపు నగదు తమ ఖాతాల్లో జమ చేయమని నగదు అతనికి ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో రవీంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పలువురు డ్వాక్రా మహిళలు తమ ఖాతాల్లో నగదు జమైంది.. లేంది చెక్‌ చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లారు. అక్కడ మేనేజర్‌ డ్వాక్రా మహిళల సూచన మేరకు ఖాతాలు చెక్‌ చేయడంతో నగదు జమకానట్లు తేలింది. దీంతో నాయుడుపాలెం, వీవై కాలనీ గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపుల సభ్యులు బాంకు ఎదుట క్యూ కట్టారు. మేనేజర్‌ నగదు కోసం మార్కాపురం వెళ్లగా గ్రూపుల సభ్యులు మాత్రం బ్యాంకు ఎదుట బైఠాయించారు. ఎవరికి వారు తాము చెల్లించిన మొత్తాలు నీటిపాలైనట్లేనా? అని ఆందోళనకు దిగారు. బ్యాంకులో తీసుకున్న పొదుపు రుణాలు చెల్లించినట్లు రవీంద్ర తమ తీర్మానాల పుస్తకంలో ఒక వైపు రాసి ఉన్నాడు. కానీ ఆ నగదు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఏయే ఖాతాల్లో ఎంతమేరకు నిధులు జమ కాలేదోనని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేయడం బ్యాంకు సిబ్బందికి సాధ్యం కాలేదు. సుమారు రూ.50 లక్షలకుపైగా నిధులు గోల్‌మాల్‌లై ఉండోచ్చని మహిళలు చెబుతున్నారు. సమగ్ర విచారణ జరిగితేనే వాస్తవాలు బయటపడతాయి. గతంలో కూడా బ్యాంకులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగి ఉండటం, ఆ విషయాన్ని  ఖాతాదారులు మరువక ముందే అదే తరహాలో మరో అవినీతి విషయం బయట పడటంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

నగదు వసూలుకు ఎవరినీనియమించలేదు:
డ్వాక్రా మహిళల వద్ద రుణాలు, పొదుపు డబ్బులు వసూలు చేసేందుకు ఎవరినీ నియమించలేదు. బిజినెస్‌ కరస్పాండెంట్‌కు పొదుపు డబ్బులు వసూలు చేసే అధికారం లేదు. ఆ ట్యాబ్‌లో ఆప్షన్‌ కూడా లేదు. ఓడీ ఖాతాలు కావడంతో ఎన్‌పీ అయితేనే వాటిని పరిశీలిస్తాం. గేదెల రుణాలు ఎక్కువగా ఎన్‌పీ అవుతున్నాయి. వాటి వసూలుకే మాకు సమయం సరిపోతోంది.శేషారావు, బ్యాంకు మేనేజర్‌

>
మరిన్ని వార్తలు