ఈ–హాజరు ఇక తప్పనిసరి

2 Nov, 2017 04:14 IST|Sakshi

పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

ప్రస్తుతం బయోమెట్రిక్‌లోకి 75.47 శాతం మంది

రోజూ డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షణ

లోపాలు అధిగమించేందుకు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి : పాఠశాల విద్యాశాఖలో టీచర్లు, విద్యార్థులు, ఇతర అధికారులకు ‘ఈ–హాజరు’ను తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అన్ని జిల్లాల విద్యాధికారులు ప్రతి ఒక్క ఉద్యోగి హాజరును బయోమెట్రిక్‌ ద్వారా నమోదు చేయించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఆదేశాలు జారీచేశారు. ఏపీ ఆన్‌లైన్, ఎన్‌ఐసీ, ఐటీ విభాగాల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ–హాజరు అప్లికేషన్‌ ద్వారా ఈ ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేయడంతో పాఠశాల విద్యాశాఖ దీన్ని 100 శాతం పూర్తిచేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఇప్పటికే 67.32 శాతం బయోమెట్రిక్‌ యంత్రాలను పాఠశాలలు, విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయాలకు పంపారు. కొన్నిచోట్ల యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో బయోమెట్రిక్‌ హాజరులో సమస్యలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఈ–హాజరు నమోదు కావడంలేదు. కొన్ని చోట్ల సిగ్నల్‌ వ్యవస్థ సరిగా లేకపోవడం, కేంద్రీకృత సర్వర్‌ వ్యవస్థ సామర్థ్యం తక్కువగా ఉండటం వంటి సమస్యలతో కూడా పలు పాఠశాలలు, కార్యాలయాల్లో ఈ–హాజరు నమోదుకావడం లేదు.

జిల్లాల వారీగా ఈ హాజరు ఇలా..
జిల్లాలవారీగా పాఠశాలల్లో టీచర్ల ఈ–హాజరు నమోదు ఎలా ఉందో పాఠశాల విద్యాశాఖ ఇటీవల విశ్లేషించింది. అక్టోబర్‌ 31వ తేదీకి సంబంధించి ఆయా కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ–హాజరు నమోదు లెక్కలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 41,601 ప్రభుత్వ స్కూళ్లుండగా 27,808 స్కూళ్లలో బయోమెట్రిక్‌ యంత్రాలు అమర్చారు. ఈ స్కూళ్లలో 1,45,087 మంది టీచర్లుండగా.. అక్టోబర్‌ 31వ తేదీ నాటి గణాంకాల ప్రకారం 75.47 శాతం వరకూ ఈ–హాజరు నమోదైంది. మిగతా సిబ్బంది హాజరు నమోదుకాలేదు. సాంకేతిక లోపాలు, యంత్రాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో పాటు టీచర్లు సెలవులు తీసుకోవడం, గైర్హాజరు వంటి కారణాలతో నమోదుకాలేదు.  శ్రీకాకుళం జిల్లా ఈ–హాజరులో ముందు వరుసలో ఉంది.

సమస్యల పరిష్కారానికి క్షేత్ర బృందాలు
ఈ–హాజరు నమోదులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి సాంకేతిక బృందాలను విద్యాశాఖ ఏర్పాటుచేస్తోంది. రోజూ ఏపీ ఆన్‌లైన్, సీఎం డ్యాష్‌బోర్డు, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పోర్టల్‌ ద్వారా ఈ–హాజరును పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 48 గంటల్లో దాన్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా టీచర్‌ ఈ–హాజరు నమోదు కాకుంటే ఆతని మొబైల్‌కు ఎస్సెమ్మెస్‌ అలర్ట్‌ వస్తుంది. మున్సిపల్‌ స్కూళ్ల ఈ హాజరు పర్యవేక్షణకు నోడల్‌ టీమ్‌ను ఏర్పాటుచేశారు. హాజరు తక్కువగా ఉన్న స్కూళ్లకు సంబంధించి ఎంఈవోలు, డీఈవోలు పర్యవేక్షించి నివారణ చర్యలు చేపట్టాలి. టీచర్లతో పాటు విద్యార్థులకూ బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేస్తున్నారు. ఆధార్‌ ఆధారిత బయో మెట్రిక్‌ హాజరుకు ఏర్పాట్లు చేశారు. ఆఫ్‌లైన్లో స్థానిక డేటా బేస్‌ ఆధారంగా విద్యార్థుల హాజరు నమోదయ్యేలా ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. శుక్రవారం నుంచి ఇది అందుబాటులోకి రానుంది.

మరిన్ని వార్తలు