ఇక వైద్య కళాశాలల్లో ఈ–శవాలు

19 Feb, 2017 07:49 IST|Sakshi
ఇక వైద్య కళాశాలల్లో ఈ–శవాలు

శరీర ధర్మశాస్త్రం తెలుసుకునేందుకు శవాలే అక్కర్లేదు
ఎలక్ట్రానిక్‌ శవాల ద్వారా శస్త్రచికిత్సలతో పాటు సరికొత్త అధ్యయనానికి శ్రీకారం
సిమ్యులేటరీ ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి
ముందుగా రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏర్పాటు


సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థులకు శరీర ధర్మశాస్త్రం వివరించాలంటే ఇకపై శవం కోసం వేచియుండాల్సిన అవసరం లేదు. బ్లాక్‌ బోర్డుపై బొమ్మలు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సరికొత్త సాంకేతిక వైద్య విద్యలో భాగంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలే శవాలుగా వచ్చాయి.తద్వారా అధ్యయనం చేసుకునే అవకాశం మన విద్యార్థులకూ దక్కనుంది. రాష్ట్రంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సిమ్యులేటరీ ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. దీనికోసం ఒక్కో కళాశాలకు రూ.20 కోట్ల వ్యయం కానుంది.

ఆపరేషన్‌ చేసిన అనుభూతి..
సిమ్యులేటరీ విధానం అనేది ఒక ఎలక్ట్రానిక్‌ వైద్య విద్య. మానవ భౌతికకాయం తరహాలోనే సృష్టించిన ఎలక్ట్రానిక్‌ శవం. గుండె, నరాలు, మెదడు, ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సల కోసం ఇందులో ఒక ప్రోగ్రామ్‌ తయారై ఉంటుంది. దీని ద్వారా నేరుగా శస్త్రచికిత్స చేసినంత అనుభూతి  కలుగుతుంది. ఆ సమయంలో రక్తస్రావం జరుగుతున్నట్టు, గుండె కొట్టుకుంటున్నట్టు, ఊపిరితిత్తుల్లో శ్వాసప్రక్రియ జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. గుండెపోటు వచ్చిన వ్యక్తికి స్టెంట్‌ వేసే పరిస్థితి క్లిష్టంగా ఉంటే.. ముందుగా దానిని సిమ్యులేటరీ పరికరంలో అధిగమించి.. ఆ తర్వాత రోగికి శస్త్రచికిత్స చేయొచ్చు. ఇలా మోకాలి నుంచి మెదడు శస్త్రచికిత్సల వరకూ ఏదైనా సరే ముందు మనిషి అవయవాలతో పోలిన కృత్రిమ యంత్రాలపై చేసుకునే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్స అయిపోగానే తిరిగి ఆ ప్రోగ్రామ్‌ను యథాస్థితిలోకి తీసుకురావచ్చు.

మూడు కళాశాలలకు అనుమతి
 కేంద్రం ఏపీలో స్కిల్‌ ల్యాబ్స్‌(సిమ్యులేటరీ) ఏర్పాటుకు మూడు కళాశాలలను గుర్తించింది. ఇందులో తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కళాశాల, విశాఖ ఆంధ్రా మెడికల్‌ కళాశాల, గుంటూరు మెడికల్‌ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే తిరుపతి ఎస్వీ కళాశాలకు దీనిని మంజూరు కూడా చేశారు. ప్రస్తుతానికి ఎంబీబీఎస్‌ అభ్యర్థులకే  ఇది అందుబాటులోకి తెస్తున్నారు. భవిష్యత్‌లో పీజీ వైద్య విద్యా రులూ ఈ విద్యను అభ్యసించే అవకాశం కల్పించనున్నారు.

మరిన్ని వార్తలు