మేధావుల నిలయం.. బుర్రలు కలుషితం

10 Aug, 2018 11:30 IST|Sakshi

ఎస్కేయూలో కులం కుదుపు

ఉన్నతాధికారి నియామకానికి రాజకీయం

మనోళ్లకు అండగా నిలుస్తానని భరోసా

పాలనా వ్యవహారాలన్నీ బయటకు..

వెలుగులోకి ఈ–మెయిల్స్‌

నన్ను ఉన్నతాధికారిగా నియమించండి. మన సామాజిక వర్గానికి అండగా నిలుస్తా. మనోళ్ల ఎదుగుదలకు దోహదపడతా. ప్రస్తుత ఉన్నతాధికారి పదవీకాలం ముగుస్తోంది. ఆయన్నే కొనసాగిస్తే మన పనులేవీ కావు. కొత్త వాళ్లు వస్తే మన సామాజిక వర్గం ఉద్యోగులకు మేలు జరగదు. ‘అన్న’కు చెప్పండి.– ఎస్కేయూ ఉన్నతోద్యోగి మెయిళ్ల సారాంశం

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. మేధావులకు నిలయమైన ఈ ఆలయం కుల పిచ్చితో కలుషితమవుతోంది. విద్యార్థులకు దిశానిర్దేశం చేసే అధ్యాపకులే తప్పుదారి ఎంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. నేను.. మనం.. వర్గం.. దిశగా సాగుతున్న వర్సిటీ రాజకీయాలతో యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలుగుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. కులం ప్రాతిపదికన సాగుతున్న అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో వీటన్నింటినీ మౌనంగా భరిస్తున్న యూనివర్సిటీ వాతావరణంఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా ఓ ఉన్నతోద్యోగి సాగించిన ‘మెయిల్‌’ రాయబేరాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉన్నత స్థాయి పోస్టును దక్కించుకోవడంలో భాగంగా సాగిన ఈ బాగోతం కాస్తా ఇప్పుడు రచ్చకెక్కింది. యూనివర్సిటీలకు షాడో చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్న ‘అన్న’ను రంగంలోకి దింపి.. తద్వారా ఆ ఉన్నతోద్యోగి లబ్ధి పొందడంతో పాటు ఆ సామాజిక వర్గం ఉద్యోగులకు అండగా నిలుస్తున్న తీరు యూనివర్సిటీని కుదిపేస్తోంది. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లోని రహస్య అంశాలను మెయిల్‌ చేయడం.. పాలకమండలి మినిట్స్‌ను సైతం చేరవేస్తున్న ఉన్నతోద్యోగి తీరు వివాదాస్పదంగా మారింది. మేధావులకు నిలయమైన విశ్వవిద్యాలయంలో వెలుగులోకి వచ్చిన ఆశ్రిత పక్షపాతం అందరినీ నివ్వెరపరుస్తోంది.

మెయిళ్ల సారాంశం
గతంలో ఎస్కేయూ ప్రశ్నపత్రాలను చెన్నైలోని ప్రతిష్టాత్మక ప్రింటింగ్‌ ప్రెస్‌లో తయారు చేసేవాళ్లు. అయితే ఎస్కేయూ యాజమాన్యం ఉన్నట్లుండి ఆ బాధ్యతలను హైదరాబాద్‌లోని ఓ ప్రెస్‌కు కట్టబెట్టారు. ఇందులో లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పాలకమండలిలో జరిగిన చర్చా వివరాలను మీకు మెయిల్‌ ద్వారా పంపుతున్నాను. పరిశీలించగలరు. హైదరాబాద్‌ కంపెనీ ఎక్కువ మొత్తం కోట్‌ చేయడంతో నిధుల దుర్వినియోగం జరిగింది. కానీ ప్రొఫెసర్ల అంతర్గత కమిటీ నిధుల దుర్వినియోగానికి ఆస్కారం లేదని తెలిపింది. అదంతా వాస్తవం కాదు. కంపెనీని మార్చడంతో నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఉంది. ప్రొఫెసర్ల అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను మెయిల్‌కు జతపరిచాను.. చూడగలరు.

మొదటి దఫా మెయిల్‌.
ప్రస్తుత ఉన్నతాధికారి పదవీ కాలం ముగిసంది. అలాగే కొనసాగిస్తే వర్సిటీ పాలన గాడి తప్పుతుంది. మన సామాజిక వర్గానికి చెందిన వారికి ఉన్నతాధికారి పదవిని అప్పగిస్తే మొత్తం పాలనంతా మన చేతుల్లోకి వస్తుంది. ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని ఉన్నతాధికారిగా నియమించేందుకు వీసీకి ఎలాంటి అవకాశం కల్పించకూడదు. నా ఆశ.. నా శ్వాస పార్టీని, మన సామాజిక వర్గానికి అండగా నిలిచేందుకే కృషి చేస్తాను.       

రెండో మెయిల్‌
చట్టవిరుద్ధంగా నియమింపబడిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైకోర్టును తప్పుదోవ పట్టించే విధానాలను అవలంబిస్తున్నారు. తరువాత నియామకాలకు ఇవి పెద్ద అవరోధంగా మారాయి. వీళ్ల పద్ధతుల్ని అడ్డుకోవాలి. మన సామాజిక వర్గం, మన పార్టీ బలోపేతం అయ్యేలా తమరు చొరవ చూపించాలి. అందుకు నన్ను ఉన్నతాధికారిగా నియమించేలా సిఫార్సు చేయండి.

ఇదీ మూడో మెయిల్‌ : రూ.7లక్షల నిధులకు రెక్కలు
యూనివర్సిటీలో అసోసియేట్, ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది  నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఇంటర్వ్యూల నిర్వహణ, ఇంటర్వ్యూ చేసే నిపుణులకు సంబంధించి టీఏ, డీఏ ఖర్చులకు రూ.7 లక్షలను ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌కు అందచేశారు. వాస్తవానికి సెక్షన్‌ హెడ్‌ అయిన డిప్యూటీ రిజిస్ట్రార్‌కు ఖర్చు చేసే అధికారాన్ని అప్పగించాలి. కానీ అతను రెండు రోజులు సెలవులో ఉన్న కారణంగా సూపరింటెండెంట్‌కు రూ.7 లక్షల చెక్‌ను అందచేశారు. పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీంతో ఈ మొత్తం చెల్లించాలి. కానీ 8 నెలలు గడుస్తున్నప్పటికీ రూ.7 లక్షలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. యూనివర్సిటీలో చక్రం తిప్పుతున్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా