ఈ–స్కూటర్లు వచ్చేస్తున్నాయ్‌..!

13 Dec, 2018 11:27 IST|Sakshi
ఈ–స్కూటర్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న, కమిషనర్‌ విజయరామరాజు (ఫైల్‌)

స్మార్ట్‌సిటీలో మరో ముందడుగు

100 స్కూటర్లు కొనేందుకు గ్రీన్‌సిగ్నల్‌

జీఓ జారీ చేసిన ప్రభుత్వం

తిరుపతి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. గడిచిన మూడేళ్లుగా ప్రతిపాదనలతో నెట్టుకొస్తున్న యంత్రాం గం ఎట్టకేలకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ స్కూటర్‌ కొనుగోలుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం బుధవారం జీఓ జారీ చేసింది.

చిత్తూరు, తిరుపతి తుడా: పెట్రోల్‌ ఖర్చులతో పాటు నగరంలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడుగులు వేస్తోంది. విద్యుత్‌ ఆదాకోసం ఇప్పటికే సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్‌ యంత్రాంగం కాలుష్య నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ బైక్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కార్పొరేషన్‌ అధికారులు పంపిన ప్రతిపాదనలకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికల్‌వల్లవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీటి కొనుగోలుకు రూ.2,05,76,220 మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. ఈ మొత్తంతో 100 స్కూటర్లను కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. మరో 20 రోజుల్లో వర్క్‌ ఆర్డర్‌ను విడుదల చేసి, జపాన్‌కు చెందిన ఓకినోవా కంపెనీకి చెందిన న్యూవర్షన్‌ ఈ–స్కూటర్లను తీసుకురానున్నారు. సంక్రాంతి కల్లా ఈ స్కూటర్లను తీసుకురావడానికి కమిషనర్‌ విజయ్‌రామరాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వార్డులు, కాలనీల్లో పర్యటించేందుకు వీటిని ఉపయోగించనున్నారు.

దేశంలోనే తొలిసారి..
జపాన్‌కు చెందిన ఓకినోవా కంపెనీ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ–స్కూటర్లను తొలిసారిగా తిరుపతి నగరానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే అనేక నగరాలు స్మార్ట్‌సిటీల్లో భాగంగా ఆయా నగరాలు ఈ–స్కూటర్ల కోసం ప్రతిపాదనలు పంపినా తిరుపతికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడే ప్రారంభించాలని కంపెనీ ప్రతినిధులు భావించారు. దీంతో దేశంలోనే తొలిసారిగా ఈ స్కూటర్లతో ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.

వీటి ప్రత్యేకత..
జపాన్‌కు చెందిన ఓకినోవా ఈ స్కూటర్లను అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించింది. మూడునెలల క్రితం కలెక్టర్‌ ప్రద్యుమ్న, కమిషనర్‌ విజయరామరాజు వీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించి ఉద్యోగుల విధుల నిర్వహణకు అనువుగా ఉందని అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే కమిషనర్‌ విజయ్‌రామరాజు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయించారు. లి«థియా బ్యాటరీతో ఈ స్కూటర్‌ రూపొందింది. 4 గంటలు చార్జింగ్‌ చేస్తే 230 కి.మీ తిరగవచ్చు. ప్రతి స్కూటర్‌కూ జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులను మానిటరింగ్‌ చేసేందుకు అ«ధికారులకు జీపీఎస్‌ విధానం దోహదపడనుంది. ఎక్కడ తిరుగుతున్నారు, ఏ వీ«ధికి వెళ్లారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అనే విషయాలను సులువుగా అంచనా వేయనున్నారు.

మరిన్ని వార్తలు