స్టాక్‌ పాయింట్లలో ఈ–వేయింగ్‌ మిషన్లు

15 Mar, 2020 04:51 IST|Sakshi

బియ్యం తూకాల్లో మోసాలకు చెక్‌ 

డీలర్లు నష్టపోకుండా పౌర సరఫరాల సంస్థ చర్యలు 

ఆగస్టు నుంచి లబ్ధిదారులకు 5, 10, 15, 20 కిలోల సంచుల్లో నాణ్యమైన బియ్యం

సాక్షి, అమరావతి: రేషన్‌ దుకాణాల్లో తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ఈ–పాస్‌ యంత్రాలను వినియోగిస్తున్నట్లే ఇకపై మండల స్థాయి స్టాక్‌ పాయింట్లలోనూ (ఎంఎల్‌ఎస్‌) అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. స్టాక్‌ పాయింట్లలో ఈ–వేయింగ్‌ మిషన్లను తప్పనిసరి చేస్తూ పౌర సరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. స్టాక్‌ పాయింట్ల వద్ద 50 కిలోల బస్తా నుంచి 1–2 కిలోల బియ్యం తీసి, డీలర్లకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసింది. గతంలో స్టాక్‌ పాయింట్లలో అక్రమాలకు అలవాటుపడ్డ కొందరు సిబ్బంది ఈ యంత్రాలను వినియోగించకుండా పక్కన పడేశారు. డీలర్ల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో ఇకపై స్టాక్‌పాయింట్లలో ఈ–వేయింగ్‌ యంత్రాల వినియోగాన్ని అధికారులు తప్పనిసరి చేశారు.   

- శ్రీకాకుళం జిల్లాలో 18, విజయనగరంలో 15, విశాఖపట్నంలో 30, తూర్పు గోదావరిలో 21, పశ్చిమ గోదావరిలో 14, కృష్ణాలో 17, గుంటూరులో 20, ప్రకాశంలో 19, నెల్లూరులో 15, చిత్తూరులో 28, వైఎస్సార్‌ కడపలో 19, అనంతపురంలో 24, కర్నూలు జిల్లాలో 17 మండల స్థాయి స్టాక్‌ పాయింట్లు ఉన్నాయి. 

- 257 స్టాక్‌ పాయింట్ల నుంచి 29 వేల రేషన్‌ దుకాణాలకు ప్రతినెలా 2.60 లక్షల టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇందులో క్వింటాల్‌కు 1–2 కిలోల చొప్పున 
బియ్యం తగ్గుతున్నట్లు ఆరోపణలున్నాయి.  

స్టాక్‌ పాయింట్లలో పనిచేసే కొందరు సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.   

- ఇకపై స్టాక్‌ పాయింట్లలో తప్పనిసరిగా ఈ–వేయింగ్‌ మిషన్ల ద్వారా బియ్యం తూకం వేసి, డీలర్లకు ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు.  

- తూకాల్లో మోసాలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నుంచి లబ్ధిదారులకు 5, 10, 15, 20 కిలోల సంచుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

- ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.  

- ఏప్రిల్‌ నుంచి జిల్లాకు ఒక నియోజకవర్గం చొప్పున ఈ విధానాన్ని అమలు చేసి, ప్రతినెలా కొన్ని చొప్పున ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.   

మరిన్ని వార్తలు