ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్

8 Nov, 2014 00:49 IST|Sakshi
ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్

నరసరావుపేట వెస్ట్
 ప్రపంచ బ్యాంకు నిధులతో మున్సిపల్ పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రీజనల్ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ చెప్పారు. రోల్టా ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పట్టణ హద్దులు, శాశ్వత గుర్తులు, పెద్ద భవనాలు తదితర అంశాలతో ప్లాన్ తయారు చేసే పనులు జరుగుతున్నాయన్నారు.

ఆయన శుక్రవారం జిల్లా రీజనల్ డైరక్టర్ వై.వెంకటపతిరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి గురవారెడ్డిలతో కలిసి రోల్టా ఆధ్వర్యంలో నరసరావుపేటలో జరుగుతున్న సర్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలు ఉండగా మొదటి విడతలో 76 పట్టణాలను ఈ ప్రక్రియకు ఎంపిక చేసినట్టు చెప్పారు. ఉపగ్రహ చాయాచిత్రాల సహకారంతో పట్టణాల్లో ఏ నిర్మాణం ఎక్కడ ఉంది, ఖాళీస్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, రోడ్లు, డ్రైన్లు, కళాశాలలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తదితర 44 రకాల అంశాలతో ఆ సంస్థ ఒక ప్లాన్‌ను రూపొందిస్తుందన్నారు.

రాబోయే 20 ఏళ్ల కాలంలో పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలు ఏవిధంగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా తగిన అవగాహన కోసం మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తోందని లక్ష్మీనారాయణ చెప్పారు. ఆ సంస్థ ఏవిధంగా చేస్తుందో పరిశీలించేందుకు తాను వచ్చానని చెప్పారు. పట్టణంలో సెల్లార్ల కొనసాగుతున్న నిర్మాణాల విషయాన్ని ప్రస్తావించగా గతంలో కంటే ఇప్పుడు నిబంధనలతో కఠినతరమయ్యాయని, పాటించని యజమానులు భారీగా అపరాధరుసుం చెల్లించాలని పేర్కొన్నారు. సెల్లార్లలో ఏమైనా నిర్మాణాలు కొనసాగుతుంటే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.

తొలుత ఆయన పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో మ్యాప్‌లను చూస్తూ ఎక్కడెక్కడ నిర్మాణాలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, టవర్లు, కాలనీలు ఉన్నాయో పరిశీలించారు. ఆయన వెంట జిల్లా రీజనల్ డైరక్టర్ వై.వెంకటపతిరెడ్డి, టీపీవో గురవారెడ్డి, బిల్డింగ్ ఇనస్పెక్టర్లు చంద్రశేఖర్, వేణు, లోల్టా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు