ఒక్కో స్టాల్.. ఒక్కో ప్రత్యేకత

5 Jan, 2016 00:29 IST|Sakshi

ఒక్కో స్టాల్‌లో ఒక్కో ప్రత్యేకత. ఒక్కో పుస్తకం ఎన్నో అంశాల కలబోత. మొత్తంగా విజయవాడ పుస్తక మహోత్సవమే ఓ విజ్ఞాన భాండాగారంగా మారిపోయింది. ఎటుచూసినా పుస్తకాలే. ఎక్కడ విన్నా విజ్ఞానాన్ని పంచే విషయాలే. చిన్నారులు నేర్చుకునే అ..ఆ..ల నుంచి పెద్దల ఆధ్యాత్మిక పుస్తకాల వరకూ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే స్టాల్‌లో ఏ రకమైన పుస్తకాలు ఉన్నాయి? అనే వివరాలు మీకోసం ప్రత్యేకం..  - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ
 
‘నోట్’ దిస్ పాయింట్

బుక్ ఎగ్జిబిషన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్టాల్ పెట్టడం ఇదే ప్రథమం. ఫైనాన్షియల్ లిటరసీ అనేది రిజర్వ్ బ్యాంకు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ‘మీ కరెన్సీ నోట్ గురించి తెలుసుకోండి..’ అనే అంశంపై ఇక్కడ ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. చిరిగిన నోట్లను వెనక్కు ఇవ్వడం ఎలా అనే విషయాలను వివరిస్తున్నారు. పెద్దపెద్ద బ్యాంకులు, సంస్థల పేర్లతో వచ్చే తప్పుడు మెయిల్స్‌ని గుర్తించడం ఎలా?, పైచదువుల కోసం విదేశాలకు వెళ్లేవారికి ఫారెన్ ఎక్స్ఛేంజ్‌పై అవగాహన, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్, ప్రైవేటు సంస్థల్లో అంటే నాన్‌బ్యాంకింగ్ రంగాల్లో డబ్బు పొదుపు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... వంటి ప్రధాన అంశాల గురించి ఉచితంగా బ్రోచర్లు పంచుతున్నారు. పదేళ్ల వయసు దాటిన పిల్లలు బ్యాంక్ అకౌంట్ తెరవడం ఎలా? ఏటీఎం కార్డు ఉపయోగించడం, చెక్ బుక్ వాడటం అన్నీ వివరిస్తున్నారు. ..ఈ వివరాలకు సంబంధించిన విషయాలను కామిక్ బుక్స్ రూపంలో పిల్లలకు అంటే 8, 9, 10  తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నామని ఆర్‌బీఐ మేనేజర్ సత్యనారాయణ  తెలిపారు. తమ స్టాల్‌కు మంచి స్పందన వస్తోందన్నారు.

మరిన్ని వార్తలు