ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్ పూర్తి

31 Aug, 2014 02:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎంసెట్ కౌన్సెలింగ్ తొలి దశ పూర్తయింది. ఇప్పటికే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తయింది. రెండో విడత, మూడో విడతల కౌన్సెలింగ్‌ను కూడా సెప్టెంబర్ 10వ తేదీలోపు పూరిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ-సెట్ కౌన్సెలింగ్‌ను కూడా పూర్తిచేసిన అధికారులు పాలిసెట్ కౌన్సెలింగ్‌పై కసరత్తు చేస్తున్నారు.

ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విజయవాడలోని మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలకు 7,267 మంది, వెబ్ ఆప్షన్స్ ఎంపికకు 1, 290 మంది విద్యార్థులు హాజరయ్యారు. వెబ్ ఆప్షన్లు ఇచిన విద్యార్థుల మొబైల్ నంబర్లకు శనివారం ఎంసెట్ కన్వీనర్ పాస్‌వర్డ్‌ను పంపారు. దాని సాయంతో వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి ఆప్షన్ల మేరకు కేటాయించిన కళాశాలను గుర్తించి, దానిని విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలి.

నగరంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌లో దాన్ని సమర్పిస్తే ఆడ్మిషన్ నంబర్ వేసి మళ్లీ విద్యార్థులకు కాపీ అందజేస్తారు. దాన్ని తీసుకువెళ్లి ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందాల్సి ఉంటుంది.అడ్మిషన్ల నంబర్ల కేటాయింపు కోసం హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్లాల్సిన వివరాలతో మళ్లీ అధికారులు షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. సోమవారం నుంచే ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
 
1 నుంచి సీట్ల కేటాయింపు
 

సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు శనివారం ఎంసెట్ కన్వీనర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రోజుకు 50 వేల మందికి హైల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా సీట్లు కేటాయించనున్నారు. నిర్ణయించిన షెడ్యూల్ తేదీల్లో హాజరుకాని విద్యార్థులు సెప్టెంబర్ ఐదో తేదీన ఎలాట్‌మెంట్ నంబర్లు తీసుకోవచ్చు
 
2,900 మంది ఈ-సెట్ విద్యార్థులకు ప్రవేశం
 
మరోవైపు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ-సెట్ విద్యార్థుల ప్రవేశానికి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల అయిన క్రమంలో 26 నుంచి నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల్లోని హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా సీట్ల ఎలాట్‌మెంట్ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 2,900 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు లెటర్లు కేటాయించారు.
 
పాలిసెట్‌కు నామమాత్రంగా హాజరు
 
ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహిస్తున్న పాలిసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు నామమాత్రంగానే హాజరయ్యారు. వరుస సెలవులు రావడంతో సోమవారం కూడా కొనసాగించనున్నారు. ఇప్పటి వరకు రెండు హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా 2,850 మందికే సీట్ల ఎలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తిచేశారు.
 
స్పెషల్ ఫీజులు ముందే చెల్లించవద్దు
 
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆడ్మిషన్లు పొందే సమయంలోనే స్పెషల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆంధ్రా లయోలా కళాశాల ఎంసెట్ క్యాంపు ఆఫీసర్ శ్రీరంగం విద్యార్థులకు సూచించారు. ఎంసెట్ మొదటి కౌన్సెలింగ్ మాత్రమే ముగిసిందన్నారు. వారం వ్యవధిలో రెండు, మూడు కౌన్సెలింగ్‌లు కూడా ఉంటాయన్నారు. విద్యార్థులు అడ్మిషన్ల సమయంలోనే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
 

మరిన్ని వార్తలు