'టీఎస్ మంత్రి హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు'

6 Jun, 2015 18:37 IST|Sakshi

హైదరాబాద్: ఉన్నత విద్యామండలి రికార్డులు అప్పగిస్తామని తెలంగాణ మంత్రి ఇచ్చిన హామీ ఇప్పటివరకూ అమలు కాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రికార్డులు ఇవ్వకపోయినా ఎంసెట్ కౌన్సిలింగ్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు గంటా తెలిపారు. ఈ నెల 12 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. డీఎస్సీ పోస్టింగ్ ల ప్రక్రియను ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. డీఎస్సీపై కొంతమంది కోర్టుకు వెళ్లారని.. ఆ విచారణ ఈనెల 10కి వాయిదా పడిందన్నారు. ప్రభుత్వం కూడా డీఎస్సీకి సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. దళారులను నమ్మొద్దని చెప్పినా.. కొందరు అమాయకులు మోసపోయారన్నారు.

 

ఈనెల 15న పాఠశాలలు పునఃప్రారంభిస్తామన్నారు. కొత్తగా మంజూరైన నిట్ కు 480 సీట్లను కేంద్ర కేటాయించిందని.. కర్నూలు ఐఐటీ, ఎన్ఐటీ తరగతులను ఈ ఏడాదిలోనే ఆరంభిస్తున్నట్లు గంటా తెలిపారు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీకి, విజయనగరంలో గిరిజన యూనివర్శిటీకి కేంద్రం స్థలాలు ఖరారు చేసిందన్నారు. నిబంధనలు పాటించని ఇంజనీరింగ్ కాలేజల సీట్లను తగ్గిస్తామని గంటా హెచ్చరించారు.

మరిన్ని వార్తలు