ఎంసెట్‌కు కౌన్సెలింగ్ కష్టాలు

16 May, 2015 02:04 IST|Sakshi
ఎంసెట్‌కు కౌన్సెలింగ్ కష్టాలు

ఈ నెల 26కు బదులు 21నే ఫలితాలు: కన్వీనర్ సాయిబాబు
 
హైదరాబాద్:  ఏపీ ఎంసెట్ ఫలితాలు త్వరగా ప్రక టించి, కౌన్సెలింగ్‌ను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నా.. జాప్యం అనివార్యం కానుంది. ఎంసెట్ ఫలితాలను షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న విడుదల చేయాల్సి ఉండగా..  21నే విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఫలితాలు ఐదు రోజుల ముందే ప్రకటించినా కౌన్సెలింగ్ మాత్రం ఆలస్యం కాకతప్పని పరిస్థితి కన్పిస్తోంది.

ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని, కౌన్సెలింగ్ నిర్వహించే సాంకేతిక విద్యామండలి భవనాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి తన స్వాధీనంలోకి తీసుకొని సీలు వేయడమే ఇందుకు కారణం. మండలి చైర్మన్ సహా అధికారులు, సాంకేతిక విద్యామండలి కౌన్సెలింగ్ సిబ్బంది 4 రోజులుగా కార్యాలయానికి రాకపోవడంతో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఫీజుల రీయింబర్స్‌మెంటుపై ప్రభుత్వం ఏం చేయనుందో స్పష్టత రావాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంటును గత నిబంధనల మేరకే కొనసాగిస్తారా? మార్పులు చేస్తారా? అన్నది తేల్చాలి. ఇలాంటివన్నీ పూర్తవ్వాల్సి ఉన్నందున.. ఎంత హడావుడి పడినా జూన్ రెండో వారం తర్వాతనే కౌన్సెలింగ్‌కు అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.

సీబీఎస్‌ఈ అభ్యర్థుల ఫలితాలు ఆలస్యం
సీబీఎస్‌ఈ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశమున్నందున ఆ అభ్యర్థుల ర్యాంకులను తర్వాత ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ చెప్పారు. ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ, రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్‌కు సంబంధించిన అభ్యర్థుల ఫలితాలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్నందున వారి ర్యాంకులూ తర్వాతనే ప్రకటిస్తామన్నారు. ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ని మే 10న విడుదల చేసి, అభ్యంతరాలను 15 సాయంత్రం వరకు  స్వీకరించామని, ఈ అభ్యంతరాలపై నిపుణుల కమిటీతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కన్వీనర్ తెలిపారు. విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి ‘ఏపీ ఎంసెట్-2015 కార్యాలయం, పరిపాలనా విభాగం, జేఎన్‌టీయూ, కాకినాడ’లో లేదా 0884-2340535 నంబర్, టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 6755లో లేదా ‘ఏపీఎంసెట్15ఎట్‌దిరేటాఫ్‌జీమెయిల్.కామ్’ ద్వారా సంప్రదించాలని చెప్పారు.

మరిన్ని వార్తలు