కల్యాణ వైభోగమే..

10 Apr, 2017 12:30 IST|Sakshi
కల్యాణ వైభోగమే..

నక్కపల్లి, న్యూస్‌లైన్: కల్యాణ కాంతులతో ఉపమాక కళకళలాడింది. కోనేటిరాయుని పరిణయోత్సవం ఉపమాకకు వినూత్న అందాలను తీసుకువచ్చింది. ప్రసిద్ధి గాంచిన ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణం గురువారం తెల్లవారుజామున కనుల పండువగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణం ఘట్టాన్ని తనివితీరా చూసి పులకించిపోయారు. ఉపమాకకు చెందిన సింహాద్రాచార్యుల ఇంటి వద్ద స్వర్ణాలంకరణ భూషితుడైన వేంకటేశ్వరస్వామిని గరుడ వాహనంపైన, పట్టువస్త్రాలు బంగారు ఆభరణాలతో ముస్తాబైన శ్రీదేవి, భూదేవిని సప్పరవాహనంపైన ఉంచి పెళ్లి మాటల తంతును నిర్వహించారు.

ఈ సందర్భంగా సింహాద్రాచార్యుల కుటుంబీకులు స్వామివారికి పసుపు కుంకుమలు, పండ్లు, పట్టు వస్త్రాలు, తాం బూలం సమర్పించారు. అనంతరం చిన్నరథంపై తిరువీధిసేవ నిర్వహించారు. తదుపరి స్వామివారి కల్యాణాన్ని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కార్యక్రమంలో భద్రాచలంకు చెందిన రామాయణం శర్మ, తెలుగు పండితురాలు డాక్టర్ వేదాల గాయత్రీ దేవి, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఈవోలు శేఖర్‌బాబు, రంగనాథస్వామి, వెంకటాద్రి, పాలకమండలి సభ్యులు బుజ్జి, సింహాద్రి, శ్రీను, చిరంజీవి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు మణిరాజు, శివాలయం మాజీ చైర్మన్‌లు సిద్దాబత్తుల జోగారావు, కొండబాబు పాల్గొన్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా వెంకన్నకు అలంకరించేందుకు విశాఖలోని ట్రెజరీ నుంచి తీసుకొచ్చిన బంగారు ఆభరణాలను గురువారం తిరిగి పంపించేశారు.
 

మరిన్ని వార్తలు