ముందస్తు చర్యలు చేపట్టాలి

18 Aug, 2013 04:37 IST|Sakshi
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పారుతున్న వరద ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వరరావు శనివారం విస్తృతంగా పర్యటించారు. నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో వరదలు ముంచెత్తిన ప్రభుత్వ కార్యాలయాలు, వరద వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. నకిరేకల్ తహసీల్దార్ కార్యాలయంలో చేరిన వరదనీటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పౌరసరఫరాల శాఖ గోడౌన్‌లో నిలిచిన వరద నీటిని పరిశీలించారు. కేతేపల్లి వద్ద మూసీ డ్యాంకు వెళ్లే మార్గంలో కల్వర్టు దెబ్బతినడంతో ద్విచక్రవాహనంపై ప్రయాణించి వరద నీటిని పర్యవేక్షించారు. అధికారులందరూ అప్రమత్తంగా పరిస్థితిని సమీక్షించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నకిరేకల్ తహసిల్దార్ కార్యాలయంలో వదర నీటికి తడిసిన రికార్డులను జాగ్రత్త పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పౌరసరఫరాల గోడౌన్‌లో తడిసిన ధాన్యంపై బీమా క్లెయిమ్ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 
 
 మూసీ డ్యాం 645 అడుగులకు గాను 641 అడుగుల మేర నీరు ఉన్నట్లు తెలిపారు. ఇన్‌ఫ్లో తీవ్రతను బట్టి మూసీ గేట్లు తెరవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో ఇప్పటివరకు 100 ఎకరాలలోపు గల 35 కుంటలకు గండ్లు పడినట్లు తెలిపారు. మరో 10 పెద్ద చెరువులకు గండ్లు పడ్డాయని వివరించారు. నీరు వథా కాకుండా యంత్రాలతో యుద్ధప్రాతిపదికన గండ్లు పూడ్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరదల వల్ల 15 మండలాల్లో 42 గ్రామాల్లో తీవ్రంగా రోడ్లు, పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. 29,602 హెక్టార్లలో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని, 
 
 మరో 150 హెక్టార్ల మేరకు ఇసుక మేట వేయగా 605 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 83 గొర్రెలు, 2004 ఫారం కోళ్లు చనిపోగా, ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని తెలిపారు. మరో వ్యక్తి చనిపోయినట్లు తెలిపారు. 100 మంది వ్యక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, ఒక పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండి వరదల వల్ల ఎలాంటి హాని జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
 
మరిన్ని వార్తలు