రెండు కుటుంబాల్లో చీకటి

8 Apr, 2016 04:40 IST|Sakshi
రెండు కుటుంబాల్లో చీకటి

ఇద్దరు మిత్రుల విషాదాంతం
వేకువ జామున జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్
ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల దుర్మరణం

 
 వారిద్దరూ ఎంబీఏ పూర్తి చేశారు. ఇక ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనుకున్నారు. అంతలోనే వారిపై విధి చిన్నచూపు చూసింది. వారి ఆశలు.. ఆశయాలను చిదిమేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. దువ్వూరు మండలం ఏకోపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
 
 ప్రొద్దుటూరు క్రైం/కల్లూరు రూరల్: కర్నూలులోని గుత్తిరోడ్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న శారదానగర్‌లో నివాసముంటున్న మాసుంపీరాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతను బేల్దారి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమారుడు నూర్ అహ్మద్ ఇటీవలే బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. కుమార్తె సబీరాకు ఇటీవలే వివాహమైంది. నబీరసూల్ తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజిలో ఎంబీఏ చదివాడు. ఇటీవలే చదువు పూర్తి కావడంతో అతని స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంలో బయలుదేరి ప్రాణాలు కోల్పోయాడు.


 క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగానికి ఎంపికైన నబీరసూల్.. ఇటీవలే కాలేజిలో నిర్వహించిన క్యాపస్ సెలక్షన్‌లో నబీరసూల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతనికి హిందూజా గ్లోబల్ సొల్యూషన్ కంపెనీలో ఉద్యోగం లభించింది. ఏడాదికి రూ.3 లక్షలు జీతం తీసుకునేలా కంపెనీ నుంచి ఒప్పందం కుదర్చుకున్నాడు. కొన్ని రోజుల ప్రాజెక్టు వర్క్ అనంతరం నబీరసూల్ ఉద్యోగంలో చేరాల్సి ఉంది.


 చిరు హోటల్ నడుపుకుంటూ..
కర్నూలు జిల్లా కల్లూరు మండలం మహాత్మానగర్‌కు చెందిన కురువ రామకృష్ణకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శివ బీటెక్ పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు ప్రవీణ్ తిరుపతిలోని చదలవాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఎ చదువుతున్నాడు. చిన్న హోటల్‌ను నిర్వహిస్తున్న రామకృష్ణ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించాడు.   ప్రవీణ్‌కు ఉద్యోగం వస్తే తమ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయని కలలు గన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.


 తిరుపతిలో ఉన్న బైక్‌ను ఇంటికి తీసుకొని వచ్చే క్రమంలో..
 ప్రవీణ్ తన పల్సర్ బైక్‌ను తీసుకొని వెళ్లి తిరుపతిలో పెట్టుకున్నాడు. ఇటీవలే చదువు పూర్తి కావడంతో బైక్‌ను ఇంటికి తీసుకొని రావాలని భావించాడు. మామూలుగా అయితే తిరుపతి నుంచి కర్నూల్‌కు రావాలంటే ప్రవీణ్‌తో పాటు నబీరసూల్ రైలులో వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో ప్రవీణ్, నబీరసూల్ బుధవారం రాత్రి తిరుపతిలో బైక్‌పై బయలుదేరారు. దువ్వూరు సమీపంలోని ఏకోపల్లిలో ఉన్న డాబా వద్ద ఆగి ఉన్న లారీని వీరు గమనించకపోవడంతో వేగంగా వెళ్లి ఢీకొన్నారు. ఈ ఘటనలో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా, నబీరసూల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొని వెళ్లగా అక్కడ మృతి చెందాడు. విషయం తెలియడంతో కర్నూలు నుంచి ఇరువురు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు